BJP – CM YS Jagan : ఏపీ రాజకీయాలను చూసి జాతీయ స్థాయి నాయకులు ఏవగించుకుంటున్నారు. మోదీ ప్రాపకం కోసం ఇక్కడ అధికార, విపక్షాలు చేస్తున్న విన్యాసాలు చూసి నవ్వుకుంటున్నారు. ఉండొచ్చు.. కానీ మరీ ఇంతలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్ కట్ చేయాలని 19విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారిని ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘అది గొప్ప కార్యక్రమం..మీరు డుమ్మా కొడ్డకూడదు’ అంటూ చేసిన ట్విట్ ఇప్పుడు రచ్చ అవుతోంది. దేశ వ్యాప్తంగా ఏపీ రాజకీయాలపై చర్చ నడుస్తోంది. బీజేపీ కోసం ఇంతలా తపన పడుతున్నారేంటి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
నూతన పార్లమెంట్ కార్యాలయ ప్రారంభానికి వైసీపీ హాజరవుతుందని సీఎం జగన్ ప్రకటించారు. అంతటితో ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ కాంగ్రెస్ తో సహా విపక్షాలకు సుద్దులు చెప్పడమే విమర్శలకు కారణమవుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ భవనం ప్రారంభం చుట్టూ రాజకీయం జరుగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని.. అందుకే తాము బాయ్ కట్ చేస్తున్నామని దేశంలో 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు ఎటువంటి ప్రకటన చేయలేదు. జగన్ బీజేపీకి అనుకూల ప్రకటన చేసి సరికొత్త ట్విట్ తో కాకరేపారు.
అయితే జగన్ బీజేపీ బ్యాచ్ అని జాతీయస్థాయి నాయకులు ఏనాడో నిర్ధారించుకున్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలకు జగన్ కు పెద్దగా ఆహ్వానం కూడా లేదు. అయితే ఈ విషయంలో చంద్రబాబుకు కాస్తా మినహాయింపు ఉంది. లోపయికారీగా కూడా జాతీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. అటు విపక్ష నేతలు సైతం చంద్రబాబు పరిస్థితి చూసి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ కారణం చేతనే బీజేపి కూడా చంద్రబాబును నమ్మడం లేదు. తమను కలిసేందుకు బాబు ముందుకొస్తున్నా పట్టించుకోవడం లేదు.
కర్నాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ నైరాశ్యంలో ఉంది. కాంగ్రెస్ గెలవడం కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీగా సాగుతాయని ఈ ఎన్నికలు సంకేతాలిచ్చాయి. బీజేపీ మునుపటిలా దూకుడు ప్రదర్శన ఉండదని తేలింది. ఈ తరుణంలో జగన్ కాస్తా తగ్గి ఉంటే బాగుండేది. తమ పార్టీ స్టాండ్ వరకూ తీసుకుని ఆగిపోయి ఉంటే పద్ధతిగా ఉండేది. కానీ ఆయన పార్లమెంటు అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. అది మన దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి పార్లమెంట్ భవనం ప్రారంభాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు. రాజకీయంగా పార్టీలు తమ అభిప్రాయాలను పక్కనపెట్టి హాజరు కావాలని సూక్తులు వల్లించడాన్ని జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఈ కొత్త ఎత్తుగడ అంటూ విమర్శలు చేయడం ప్రారంభించాయి.