Y S Jagan Mohan Reddy: అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి అంటారు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) అబద్ధం ఆడడంలో కూడా ఫెయిలవుతున్నారు అనిపిస్తోంది. ఆయన పార్టీ నేతలు కొడాలి నాని లాంటి వారు కూడా జగన్ మోహన్ రెడ్డిని అబద్ధాలు చెప్పమంటే చెప్పలేరు అని కామెంట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు అది నిజమే అని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో అదే చర్చ నడుస్తోంది. ఇటీవల అనకాపల్లి జిల్లాలో ఆదిత్య మిట్టల్ కంపెనీ భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది నెలల కిందటే ఈ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అదంతా ఉత్త ప్రచారం అని తేల్చేశారు. ఇప్పుడు శంకుస్థాపన జరిగిన తర్వాత మరోసారి మాట్లాడారు. అదంతా తన హయాంలో వచ్చిన దేనని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి జగన్మోహన్ రెడ్డి పై.
* ఆయన విజయమేనట..
మిట్టల్ ప్రాజెక్టు( Mittal projects ) విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ అది తన విజయం అని చెప్పుకోవడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి తగదు. పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకోవడం సహజం. కానీ అబద్ధాన్ని నిజం చేస్తామని చెప్పడం మాత్రం అంత సులువు కాదు. నిత్యం మనల్ని సోషల్ మీడియా కనిపెట్టే రోజులు ఇవి. అందుకే మిట్టల్ స్టీల్ ప్లాంట్ పై గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్.. ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ ను జత చేసి మరి ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. విశాఖకు వచ్చిన గూగుల్ డేటా సెంటర్ తన వల్లే వచ్చిందని చెబుతారు. రాష్ట్రానికి మంచి జరిగితే తన వల్ల అంటారు. చెడ్డ జరిగితే చంద్రబాబుతో పాటు పవన్ పై తోసేస్తారు. అయితే మనం చెబితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు వినవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఏ పార్టీతో సంబంధం లేని వారు ఉంటారు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోవడం వల్లే ఇప్పుడు జగన్ అడ్డంగా బుక్ అవుతున్నారు.
* పెట్టుబడుల జాడలేదు..
ఐదేళ్ల వైసిపి( YSR Congress party) పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మాత్రం సంక్షేమ పథకాలు కొంతవరకు అమలు చేయగలిగారు. బటన్ నొక్కుడుతో కాలం గడిపారు. అంతవరకు ఒకే కానీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టులు తన ఖాతాలో వేసుకోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన వారి సైతం వెళ్ళిపోయారు. కళ్ళ ముందు స్పష్టమైన నిజం కనిపిస్తుంటే.. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముందు ఒక మాట.. తరువాత ఒక మాట అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇలా అయితే ఆ పార్టీ బలోపేతం మాట ఎరుగు. ఉన్న పరువు సైతం పోయే ప్రమాదం ఉంది.