Jagan Delhi Tour: ఢిల్లీలో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. హస్తిన కేంద్రంగా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నేరుగా బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఏపీలో పొత్తుల విషయమై చర్చించారు. సీట్ల సర్దుబాటు పై సైతం మంతనాలు సాగినట్లు తెలుస్తోంది. టిడిపి, జనసేన తో పాటు కూటమిలోకి బిజెపి వస్తుందని.. టిడిపి సైతం ఎన్డీఏలోకి రీఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ సడన్ టూర్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎటువంటి ముందస్తు హడావిడి లేకుండా.. చంద్రబాబు వెళ్లిన తరువాత జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ఆకస్మిక పర్యటనపై ఢిల్లీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలో అడుగుపెట్టిన జగన్ ఏదో రాజకీయం చేయడానికి తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ అగ్ర నేతలను కలిసిన కొద్ది గంటలకే.. తాను కలిసి రాజకీయాన్ని సరికొత్తగా మలుపు తిప్పాలని భావించారు. అటు వైసిపి అనుకూల మీడియా సైతం ఇదే ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ జగన్ కు దక్కకపోవడంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇస్తారని అంతా భావించారు. కానీ ఎందుకో అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈరోజు అమిత్ షా తో కలుస్తారని చెబుతున్నారు. అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.
ప్రధాని నరేంద్ర మోడీతో ఈరోజు 11 గంటలకు జగన్ భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే సాధారణంగా రాజకీయ వ్యవహారాలను అమిత్ షా, జేపీ నడ్డా చూస్తారు. కేవలం పాలన వ్యవహారాలపైనే ప్రధాని భేటీలకు అనుమతిస్తారు. వైసిపి పాలనకు కేవలం నెలరోజుల గడువు ఉంది. పోలవరం నిధులు రియంబర్స్మెంట్, ఇతరత్రా సమస్యలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రకాల విభజన హామీలపై కేంద్రం నుంచి సానుకూలత తీసుకుని.. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. వాటి కోసమే ఆయన ప్రధాని మోదీని కలుస్తారని.. అందులో రాజకీయాలు ఏవి ఉండవని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలుస్తామంటే అపాయింట్మెంట్లు అవసరం లేదు. పైగా నిర్మలా సీతారామన్ వంటి బిజెపి మంత్రులు జగన్ కు ఎనలేని గౌరవం ఇస్తుంటారు. కానీ హోం మంత్రి అమిత్ షాకు కలవాలంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవాలి. జగన్ కోరిన వెంటనే అమిత్ షా అపాయింట్మెంట్ లభించేది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. జగన్ అపాయింట్మెంట్ కోరినా అమిత్ షా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో ఏపీలో పొత్తులతోనే కేంద్ర పెద్దలు జగన్ ను దూరం పెడుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. సహజంగా ఇది వైసీపీ శ్రేణులకు మింగుడు పడని అంశం.