YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తరుణంలో.. దూకుడు పెంచాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాలకు సైతం బాధ్యులను నియమించారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న లక్ష్యంతో ఉన్నారు. గతం మాదిరిగా మొహమాటలకు వెళ్లకూడదని భావిస్తున్నారు. కొందరు నేతల విషయంలో కూడా సీరియస్ ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై బలమైన చర్చ నడుస్తోంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.. పార్టీ కోసం పని చేయాలని జగన్ ఆదేశించినట్లు ప్రచారం సాగుతోంది.
* ఓటమి తర్వాత కనిపించని నేత..
మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా బయటకు కనిపించలేదు.. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. అప్పుడప్పుడు నెల్లూరు సిటీ కి వచ్చి ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కార్యాలయాలకు రావడం లేదు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చూస్తున్నారు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ ను అక్కడ దూరంగా ఉంచారు.
* అనిల్ వైఖరితోనే..
నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడటానికి ప్రధాన కారణం అనిల్ కుమార్ యాదవ్ అని ఒక ఆరోపణ ఉంది. ఆయన నమ్ముకొని రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే తన అనుకున్న వారు సైతం పార్టీకి దూరమయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలంతా దూరం కావడానికి ప్రధాన కారణం అనిల్ కుమార్ యాదవ్. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న నాయకులతో సైతం అనిల్ యాదవ్ కు అంతగా పడదు. అయినా సరే అనిల్ దూకుడును మెచ్చి నరసరావుపేట పార్లమెంటు స్థానానికి టికెట్ ఇచ్చారు. అయితే అక్కడ ఓడిపోయిన తర్వాత గత రెండేళ్లలో అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అందుకే ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* అక్కడి నుంచి నో ఛాన్స్..
మరోసారి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. కానీ అక్కడ టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఆయనకు టిక్కెట్ ఇస్తే రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే ఈసారి జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి టిక్కెట్ ఇవ్వకుండా పార్టీ కోసం పని చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా అనిల్ కుమార్ యాదవ్ కూడా షాక్ కు గురయ్యారని తెలుస్తోంది. పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి గురించి అంత కష్టపడితే తనకు టిక్కెట్ ఇవ్వనని తేల్చి చెప్పడంపై ఆయన ఆవేదనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.



