Middle East Crisis: ఇరాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ విషాదాంతం.. ఇజ్రాయిల్ పై అనుమానం!

గత కొద్దిరోజులుగా ఇజ్రాయిల్ పై పోరాటం చేస్తున్న హమాస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్ లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది.

Written By: Dharma, Updated On : July 31, 2024 1:18 pm

Middle East Crisis

Follow us on

Middle East Crisis: అంతర్జాతీయంగా మరో దిగ్బ్రాంతికర ఘటన జరిగింది. ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్ హమాస్ రాజకీయ విభాగం అధినేత ఇస్మాయిల్ హనియా దారుణ హత్యకు గురయ్యారు. బాడీగార్డ్ సైతం దుర్మరణం పాలయ్యారు. టెహరాన్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఇస్మాయిల్ బసచేసిన ఓ భవనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇస్మాయిల్ తో పాటు ఆయన బాడీగార్డ్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్, హమాస్ సంస్థ సైతం ధ్రువీకరించింది. ఈ దాడి వెనుక ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నాయి. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజస్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవములో పాల్గొనడానికి ఇస్మాయిల్ ఇటీవల టెహరాన్ వచ్చారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో బస చేశారు. ఆయనతోపాటు హమాస్ ప్రతినిధులు కొందరు అక్కడే ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ భవనంపై అందరూ దాడికి పాల్పడ్డారు. వరుసగా కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ ను టార్గెట్ చేసుకునే ఈ దాడులు సాగినట్లు తెలుస్తోంది. ఇస్మాయిల్ ను కాపాడుకునే ప్రయత్నంలో బాడీగార్డ్ సైతం మృతి చెందాడు. ఈ హత్య పై హమాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇస్మాయిల్ హత్యకు ఇజ్రాయిల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.ఆయన హత్యతో పాలస్తీనా ప్రజలు విషాదంలో మునిగిపోయారు. గొప్ప పోరాటయోధుడని ప్రజలు నివాళులు అర్పిస్తూ కొనియాడారు అరబ్ దేశాలకు ఇది లోటుగా రాజకీయ నేతలు అభివర్ణించారు.

* అంచలంచలుగా ఎదుగుతూ
ఇస్మాయిల్ 1963 లో గాజా సిటీకి సమీపంలో ఓ శరణాది శిబిరంలో జన్మించాడు. 1980లో హమాస్ లో చేరాడు. 1990లో తొలిసారిగా ఇస్మాయిల్ పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ కు ఇస్మాయిల్ అత్యంత సన్నిహితుడు. రాజకీయ సలహాలు ఇస్తూ ఆయనకు దగ్గరయ్యాడు. అంచలంచెలుగా ఎదుగుతూ సంస్థలో పట్టు సాధించాడు. 2004లో ఇజ్రాయిల్ దాడుల్లో అహమ్మద్ యాసిన్ హత్యకు గురయ్యాడు. అటు తర్వాత హమాస్ లో కీలక పాత్ర పోషించాడు ఇస్మాయిల్.

* ప్రధానిగా ఎంపిక..
పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై.. 2006లో గాజా పట్టీని పాలించాడు. 2007 జూన్ లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించాడు. నాటి నుంచి గాజాలో ఫతా-హమాస్ యుద్ధం జరుగుతోంది. అబ్బాస్ ఆదేశాలను పక్కనపెట్టి గాజాలో ప్రధాని బాధ్యతలు చేపట్టాడు. 2017లో హమాస్ చీఫ్ గా ఎంపికయ్యాడు.అటు తరువాత అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

* కుటుంబ సభ్యులను కోల్పోయి..
2019లో గాజా పట్టి వీడాడు ఇస్మాయిల్. ఖతర్ లో నివాసముంటూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇజ్రాయిల్ దాడుల్లో ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు చనిపోయారని ప్రచారం జరిగింది. ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, మనవరాలు మరణించినట్లు అప్పట్లో హమాస్ ప్రకటించింది. ఇజ్రాయిల్ పై పోరాడే క్రమంలో ఇస్మాయిల్ పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరించారు. కుటుంబాన్ని కోల్పోయిన ఇజ్రాయిల్ పై పోరాటం ఆగదని అప్పట్లో ఇస్మాయిల్ ప్రకటించాడు. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాల్లో ఇస్మాయిల్ క్రియాశీలకంగా వ్యవహరించాడు. అందుకే ఆయనను ఇజ్రాయిల్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.