Jagan CBI court hearing: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఇకనుంచి వారం వారం కోర్టుకు వెళ్లాల్సిందేనా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. ప్రతిపక్ష నేత అంతకంటే కాదు. ఆ రెండింటిని సాకుగా చెప్పి ఎన్ని రోజులు ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. కానీ రేపు కోర్టుకు హాజరవుతున్నారు. దీంతో న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఆరేళ్లుగా ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. చివరిసారిగా 2019 మార్చిలో హాజరయ్యారు. తరువాత ఎన్నికల ప్రచారంలో బిజీ, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడంతో కోర్టుకు హాజరైతే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి.. కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపులు తెచ్చుకున్నారు. అయితే ఓడిపోయిన తరువాత.. గత 17 నెలలుగా ఆయన సాధారణ ఎమ్మెల్యే గానే ఉన్నారు. అయినా కోర్టుకు హాజరు కాకపోవడం విశేషం. ఇటువంటి పరిస్థితుల్లో రేపు కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోనన్న చర్చ నడుస్తోంది.
Also Read: జగన్ ఈసారైనా అక్కడికి వెళ్తారా?
ఆరేళ్లపాటు హాజరు..
అక్రమస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దాదాపు 11 కేసులు ఆయనపై నమోదయ్యాయి. 47 వేల కోట్ల రూపాయల వరకు అక్రమంగా ఆర్జించారన్నది ఆయనపై ఉన్న అభియోగం. 2012లో ఆయన అరెస్టయ్యారు. దాదాపు 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. 2013 సెప్టెంబర్ లో ఆయన విడుదలయ్యారు. అప్పటినుంచి కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే బెయిల్ పై విడుదలైన ఆయన కు సిబిఐ కోర్టు( CBI Court) కొన్ని షరతులు విధించింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. అప్పటినుంచి ఆయన ప్రతి వారం కోర్టుకు హాజరవుతూనే వచ్చారు. చివరకు 2017 పాదయాత్ర సమయంలో సైతం ప్రతి గురువారం ముగించి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. తిరిగి శనివారం పాదయాత్రను ప్రారంభించే వారు. 2019 మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. కానీ వైసీపీ హయాంలో ఐదేళ్లతో పాటు గత 17 నెలల కాలంగా ఆయన కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రాలేదు.
న్యాయవ్యవస్థలో లూప్ హోల్స్ తో..
అయితే దేశంలో న్యాయవ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ వినియోగించుకోవడంలో జగన్మోహన్ రెడ్డికి సాటి ఎవరూ రారు. ఎందుకంటే ఆయన కేసుల్లో 400కు పైగా వాయిదాలు పడ్డాయి. 35కు పైగా డిస్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. 35 మందికి పైగా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చట్టంలో ఉన్న లొసుగులను పట్టుకొని గత 13 ఏళ్లుగా ఆయన కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. అధికారానికి దూరమై 17 నెలలు అవుతున్న ఆయన కోర్టుకు హాజరు కావడం లేదంటే ఏ స్థాయిలో వినియోగించుకుంటున్నారో అర్థమవుతుంది. అయితే కిందట నెల ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో కోర్టు అనుమతి తీసుకున్నారు. దీంతో కోర్టు అటు నుంచి వచ్చాక వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో కూడా మినహాయింపు అడిగారు జగన్మోహన్ రెడ్డి. కానీ కోర్టు అంగీకారం తెలపలేదు.
Also Read:వైయస్ షర్మిల కు పెద్ద కష్టం!
ఏ పదవులు లేకపోవడంతో..
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. ఆపై ప్రతిపక్ష నేత కూడా కాదు. ముఖ్యమంత్రి అయ్యాక కోర్టుకు హాజరయ్యే క్రమంలో భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ బెయిల్ పొందారు జగన్మోహన్ రెడ్డి. కోర్టుకు రాకుండా మినహాయింపు కూడా అలానే పొందారు. అయితే ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. అయినా సరే తాను కోర్టుకు హాజరైతే.. భద్రతాపరమైన చర్యలు కల్పించడంలో ప్రభుత్వానికి భారం కలుగుతుందని కోర్టుకు తెలిపారు. అయినా సరే న్యాయస్థానం హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇదే దూకుడుతో న్యాయస్థానం తీర్పు ఇస్తే మాత్రం మళ్లీ వారం వారం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.