Jagan: అయ్యప్ప దీక్ష అంటేనే నిష్టతో కూడుకున్నది. ఎంతో నిబద్ధతతో, భక్తితో చేపట్టేది. కానీ అటువంటి అయ్యప్ప దీక్షలో రాజకీయ భక్తి కనిపిస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా శబరిమలైలో అయ్యప్ప స్వామి శరణు ఘోష మధ్య జై జగన్ ( Jai Jagan) అంటూ కొంతమంది దీక్షాపరులు నినదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒక నాయకుడిగా అభిమానం చూపాలే తప్ప.. ఇలా నిష్టతో కూడిన దీక్షలో ఇదేం పని అంటూ ప్రశ్నించిన వారు ఉన్నారు. అంతటితో ఆగలేదు వీరి చర్యలు. ఏకంగా సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డిని దేవుడితో పోల్చారు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపైనే హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
* అకస్మాత్తుగా జగన్ నినాదం..
సాధారణంగా అయ్యప్ప ఇరుముడుల సమయం ఇది. పెద్ద ఎత్తున ఏపీ( Andhra Pradesh) నుంచి భక్తులు శబరిమలై వెళుతుంటారు. అయితే పాయకరావుపేట ప్రాంతం నుంచి వైసీపీ సానుభూతిపరులు, అయ్యప్ప దీక్షాపరులు శబరిమలై వెళ్లారు. ఒకవైపు ఇరుముడిని నెత్తిన పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోష చేసుకుంటూ వెళుతున్న వీరు అకస్మాత్తుగా జై జగన్ అంటూ నినదించారు. జగన్ 2.0 పోస్టర్ను చేత పట్టుకొని మరి వీరు అలా నినదించడం విశేషం. వీరు చేసిందే అతి అయితే.. అభిమానం అంటే ఇది అంటూ సాక్షి మీడియా ఈ కథనాన్ని ప్రచురించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
* హిందూ వ్యతిరేక ముద్ర
వాస్తవానికి జగన్ సర్కార్( Jagan government) హయాంలో జరిగిన పరిణామాలపై జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. హిందూ వ్యతిరేక విధానాలను అనుసరించే వారని.. అన్య మతాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారని ఒక విమర్శ ఉంది. హిందువులు సైతం వైసీపీ పట్ల అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో ఇతర రాష్ట్రాల్లో హిందూ వేదికల వద్ద.. ఈ తరహా ప్రచారం వైసీపీకి ఎంత మాత్రం మంచిది కాదు. ఇటువంటి రాజకీయ భక్తి ఆ పార్టీకి చేటు తెస్తుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా వైసీపీ నాయకత్వం ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని సూచిస్తున్నారు.