Ipac team : జగన్ ఐప్యాక్ సేవలను కొనసాగిస్తారా? లేదా? 2019 ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ సేవలు అందించింది. ఆ ఎన్నికల్లో వైసిపి మంచి విజయం సాధించింది. అప్పట్లో అధికార టిడిపిపై విష ప్రచారం చేయడంలో ఐప్యాక్ సక్సెస్ అయ్యింది. ప్రజలను కులమత వర్గాలుగా విభజించి వైసిపి వైపు టర్న్ అయ్యేలా చేయడంలో ఐప్యాక్ పాత్ర ఉంది. 2014 నుంచి 2019 మధ్య ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడంలో ఐ ప్యాక్ టీంది కీలక పాత్ర.అప్పట్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలకు తగ్గట్టు సోషల్ మీడియాలో ప్రచారం లభించేది. ప్రజల్లోకి బలంగా వెళ్లేది. అయితే దాదాపు 350 కోట్ల రూపాయలు ఐ ప్యాక్ కు చెల్లించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐప్యాక్ టీంకు సారధ్యం వహిస్తున్న ప్రశాంత్ కిషోర్ దూరమయ్యారు. ఆయన స్థానంలో రుషిరాజ్ సింగ్ వచ్చారు. 2019 నుంచి 2024 మధ్య సైతం ఈయన నేతృత్వంలోని ఐప్యాక్ టీం సేవలందించింది. కానీ వైసీపీ గట్టెక్క లేకపోయింది. దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే ఈసారి ఐప్యాక్ టీం సేవలందిస్తుందా? సేవలు కొనసాగించే ఉద్దేశ్యం ఉందా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే గత ఐదేళ్లుగా వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి ఈ టీంకు డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి.. నేరుగా పార్టీ నుంచి నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
* తప్పిన అంచనాలు
వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగింది వైసిపి. ఎన్నో రకాల వ్యూహాలతో చాలా సులువుగా విజయం సాధించుకోవచ్చు అని భావించింది. కానీ ఐ ప్యాక్ టీం అంచనాలు ఫలించలేదు. దారుణంగా దెబ్బతింది వైసిపి. కనీసం పరువు కూడా దక్కించుకోలేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా.. అన్ని ప్రాంతాల్లో వైసీపీకి కనీస ప్రాతినిధ్యం తగ్గలేదు. కొన్ని జిల్లాల్లో కూటమి వైట్ వాష్ చేసింది. ఐ ప్యాక్ టీం లోపాల వల్లే వైసీపీకి దారుణ పరాజయం ఎదురైందని ఆ పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు.
* అధికారంలోకి వచ్చిన తర్వాత
2019లో కనీ విని ఎరుగని విజయం వెనుక ఐ ప్యాక్ టీం ఉందని జగన్ నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్యేల కంటే ఐప్యాక్ బృందానికి విలువ ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యే వెంట ఐ ప్యాక్ టీం ను పురమాయించారు. వారిచ్చిన నివేదికతోనే టిక్కెట్లు కేటాయించారు. చివరకు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ రహదారిని బాగు చేస్తే ప్రజలు గుర్తిస్తారో అన్నది ఐప్యాక్ టీం నివేదిక ఇచ్చేదాకా పరిస్థితి వచ్చిందంటే జగన్ వారికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలుస్తుంది. చివరకు వారు అధికారిక సమీక్షల్లో సైతం పాల్గొనేవారు. వైసిపి ఎమ్మెల్యేల పనితీరును నిశితంగా పరిశీలించి హై కమాండ్ కు నివేదికలు ఇచ్చేవారు.
* పార్టీ కంటే వారికే ప్రాధాన్యం
ఎన్నికల్లో పోలింగ్ అనంతరం జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ శ్రేణుల కంటే వారికే ప్రాధాన్యమిచ్చారు. వారితోనే సమావేశమై గెలుపు వైసిపి దేనని ప్రకటించారు. కానీ ఫలితాలు మరోలా వచ్చాయి. కేవలం అధినేత తీరు, ఐ ప్యాక్ టీం వ్యవహార శైలి తమ కొంప ముంచిందని వైసీపీ నేతలు బాధపడుతున్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఐప్యాక్ రీ ఎంట్రీ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే వారిని ఆహ్వానించే పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు లేరు. మరి జగన్ పార్టీ శ్రేణులతో సంప్రదించి ఐ ప్యాక్ టీంకు అవకాశం ఇచ్చారా? లేకుంటే తనకు తాను స్వయం నిర్ణయం తీసుకున్నారా? అన్నది తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More