Jagan: ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే అంటారు పెద్దలు నోరు పారేసుకోకూడదని. అయితే ఈ విషయం ఏపీ సీఎం జగన్ కు తెలియంది కాదు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని దుష్టులుగా చూపించడంలో జగన్ ఆరితేరిపోయారు.విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ ల తో పాటు ప్రధాన మీడియా సంస్థలను దుష్ట చతుష్టయంతో జగన్ పోల్చారు. ఇప్పుడు అదే దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను చూపి కొత్తరకంగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఇటీవల ఓ బహిరంగ సభలో జగన్ ఈనాడు పేపర్ ను చూపించారు. అందులో ఏముందో చదివి వినిపించారు. తప్పు పట్టాలనో.. అందులో తప్పు రాశారనో చెప్పేందుకు అలా చేశారు. ఈనాడులో తప్పుడు కథనాలు వస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సాక్షిలో వచ్చే కథనాలను నిజం అనుకునే వైసిపి వాళ్లకు.. ఈనాడు చూపించి సరికొత్త సంకేతాలు ఇచ్చారు. ఈనాడును తరచూ చదవాలని పురమాయించేలా ప్రవర్తించారు. సహజంగానే ఇది ఈనాడుకు కలిసి వచ్చేఅంశం. సాక్షాత్ సీఎం ఈనాడు ను చూపించారంటే.. పాము కూడా అనుసరించడానికి శ్రేణులు సిద్ధపడతాయి. ఈనాడు సంస్థకు అంతకుమించి పబ్లిసిటీ ఏముంటుంది.
ఈనాడు పై ఎవరి అభిప్రాయం వారిది. రాజకీయంగా ఒకలా చూస్తారు. అందులో ఉన్న వార్తలు దృష్ట్యా మరో కోణంలో ఆలోచిస్తారు. కానీ ఎక్కువమంది ఈనాడు నే ఇష్టపడతారు. ఇది సీఎం జగన్ కు కూడా తెలుసు. ఈనాడును అధిగమించాలని జగన్ చాలా సందర్భాల్లో చూశారు. తన సాక్షి మీడియాను జాకీలో పెట్టి మరి లేపారు. కానీ ఏది చేసినా మూన్నాళ్ళ ముచ్చటే. ఈనాడు బ్రాండ్ ఇసుమంత కూడా తగ్గించలేకపోయారు.
తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించారు. టిడిపి, జనసేన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈనాడులో వచ్చిన ఈ పథకాల గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. తాము ఇస్తున్న దాని కంటే మూడింతల సంక్షేమం ఇస్తామంటున్నారని.. అది సాధ్యం కాదని తేల్చి చెప్పే క్రమంలో ఇలా చేస్తుండడం విశేషం. మొత్తానికి అయితే ఏ నోటితో దుష్ట చతుష్టయం అని సంబోధించారో.. అదే మీడియాను టిడిపి, జనసేనలపై వ్యతిరేక ప్రచారానికి ఉపయోగిస్తుండడం విశేషం.