Jagan foresights is politics  : 2029 ఎన్నికలకు జగన్ భారీ స్కెచ్.. కాంగ్రెస్ పార్టీ వైపు చూపు.. ఢిల్లీ కేంద్రంగా రాజకీయం!

ఈ ఎన్నికల్లో కూటమి కట్టిన మూడు పార్టీల చేతుల్లో జగన్ ఓడిపోయారు. తాను ఒంటరిగానే విక్టరీ సాధిస్తానని చెప్పుకొచ్చిన జగన్ కు మూడు పార్టీలు కలిసి గట్టి షాక్ ఇచ్చాయి. 2029 ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకుండా జగన్ ముందుగానే అప్రమత్తమయ్యారు. ఢిల్లీ వేదికగా రాజకీయాలు ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : July 23, 2024 3:24 pm
Follow us on

Jagan foresights is politics : జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా?ఆ పార్టీ సేఫ్ జోన్ అని భావిస్తున్నారా? కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉండడంతో ఆ పార్టీని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారా?పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. ఇప్పుడు బిజెపికి టిడిపి అవసరం కీలకం. టిడిపి తో పొత్తు సక్సెస్ అవుతూ వస్తోంది.అందుకే ఈ బంధాన్ని లాంగ్ టైం కొనసాగించాలని కేంద్ర పెద్దలతో పాటు చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే ఇప్పుడు జగన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

* పుంజుకుంటున్న కాంగ్రెస్
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గణనీయమైన స్థానాలను సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బిజెపి బలం క్రమేపి తగ్గుతోంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలే సాధిస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా సత్తా చాటింది. ఆ రెండు రాష్ట్రాల ప్రభావం ఏపీ పై ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వైసిపి పావులు కదపడంతో.. ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైపు వైసిపి అడుగులు వేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీ వైసీపీని ద్వేషించింది. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న టిడిపికి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకారం అందించింది. పైగా కర్ణాటక డిప్యూటీ
సీఎం డీకే శివకుమార్, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితులు అన్న ముద్ర పడింది. అదే ఇప్పుడు జగన్ ఆందోళనకు కారణం.

* వెంటాడుతున్న భయం
జగన్ కు తెలంగాణతో పాటు కర్ణాటకలో విలువైన ఆస్తులు ఉన్నాయి. వైసిపి నేతలకు సైతం ఆ రెండు రాష్ట్రాలతో మంచి అనుబంధము ఉంది. అందుకే ఇప్పుడు జగన్ పునరాలోచనలో పడ్డారు. వైసిపి నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకుంటే ముఖ్యమని భావిస్తున్నారు. పైగా బిజెపితో టిడిపి ఉన్నందున.. కేంద్ర పెద్దలు జగన్ ను పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పైగా టిడిపి తో పొత్తు కలిసి వస్తుండడంతో జగన్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. అందుకే జగన్ ఇప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఆప్షన్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది.

* జాతీయ పార్టీల కోసం ఆరాటం
జగన్ ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టడానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలకు చేరువ కావడానికి అన్న ప్రచారం జరుగుతోంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ వెంట నడిచే పార్టీలు లేవు. గత అనుభవాల దృష్ట్యా వామపక్షాలు జగన్ వెంట నడిచేందుకు ముందుకు రావు. గత ఐదేళ్ల కాలంలో వామపక్షాలను ఒక రాజకీయ పార్టీగా కూడా జగన్ చూడలేదు. కనీసం వామపక్ష నేతలకు అపాయింట్మెంట్ లభించలేదు. వారు చేసే పోరాటాలను సైతం ఉక్కు పాదంతో నిర్వీర్యం చేశారు జగన్.అందుకే వామపక్షాలు జగన్ అంటే మండిపడతాయి.బిజెపితో కలిసి చేసిన రాజకీయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. బిజెపితో నేరుగా కలిసిన చంద్రబాబు కంటే జగన్ ప్రమాదకరి అని వామపక్షాలు భావిస్తున్నాయి. అందుకే వైసీపీతో ఏపీలో కలిసినడించేందుకు ముందుకు రావడం లేదు.

* సయోధ్య కోసం
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో సయోధ్య చేసుకోవడమే జగన్ ముందు ఉన్న కర్తవ్యం.ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీఅన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ బలంగా లేని చోట్ల ఇండియా కూటమితో సర్దుబాటు చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఇండియా కూటమిలో వామపక్షాలు ఉన్నాయి. మరోవైపు వైసిపిఏ కూటమిలో లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక కూటమిలో చేరాల్సిన పరిస్థితి వైసీపీపై ఉంది. అందుకే జగన్ ఢిల్లీ పై దృష్టి పెట్టారు. ఇప్పటి నుంచే మిగతా రాజకీయ పక్షాలను కలుపుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. తద్వారా ఏపీలో బలమైన ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలంటే ఇండియా కూటమితోనే సాధ్యమని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకు ఢిల్లీ వేదికగా బీజం వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని చూస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.