YCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీల్లో అనూహ్యంగా కొందరికి టికెట్లు దొరుకుతున్నాయి. టిడిపి,జనసేన అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది సీనియర్లకు టిక్కెట్లు దక్కలేదు. కానీ చాలామంది జూనియర్లకు టిక్కెట్లు దక్కడం విశేషం. మహాసేన రాజేష్, కొలికపూడి శ్రీనివాస్ లాంటి నేతలకు టికెట్లు దక్కాయి. ఇది సీనియర్లకు మింగుడు పడని విషయం. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణలు వంటివి పరిగణలోకి తీసుకొని వారిని ఎంపిక చేసినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు వైసీపీలో సైతం కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జగన్ పార్టీ ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడి నుంచి అభ్యర్థులను మార్చనని.. ఇప్పటివరకు వెల్లడించిన మార్పులతో సరి అని జగన్ తేల్చి చెప్పారు. అయితే ఎక్కడికి అక్కడే బలమైన అభ్యర్థులను బరిలో దించే క్రమంలో.. మరికొందరి మార్పులు తప్పవని సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు టికెట్ ఇచ్చేందుకు జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.
తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తన సర్వీసులకు రాజీనామా చేసి మరి ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కలెక్టర్ గా ఆయన వ్యవహరించారు. ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా, సెర్ఫ్ సీఈఓ గా కూడా ఉన్నారు. ఆయన సర్వీసు మరో నాలుగేళ్లు ఉంది. ఆయన సొంత జిల్లా కర్నూలు. తన సర్వీసులకు రాజీనామా చేసి వైసీపీలో చేరుతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
సీనియర్ ఐఏఎస్ అధికారి కావడంతో కలిసి వస్తుందని జగన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఆయనకు త్వరలో మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తారని తెలుస్తోంది. కర్నూలు టికెట్ను ఆశిస్తున్న మరో సీనియర్ ఎస్పీ మోహన్ రెడ్డికి కర్నూలు మేయర్ పదవి ఆఫర్ చేస్తారని సమాచారం. ఇప్పటికే బీ వై రామయ్యకు కర్నూలు లోక్ సభ టికెట్ దాదాపు ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలో ఇంతియాజ్ వైసీపీలో ఎంట్రీ ఇవ్వడం.. కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకేనని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.