Jagan: వైయస్ షర్మిల ఒంటరి అయ్యారా? ఆ కుటుంబంలో అందరూ కలిసి పోయారా?మొన్నటి ఎన్నికల ఫలితాలతో ఆ కుటుంబంలో పశ్చాత్తాపం కనిపిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.ఒకప్పుడు కడప అంటే రాజశేఖర్ రెడ్డి..రాజశేఖర్ రెడ్డి అంటే కడప అన్న పరిస్థితి ఉండేది. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత అదే పరిస్థితిని కొనసాగించారు జగన్.కడప జిల్లాతో పాటు రాయలసీమలో స్పష్టమైన పట్టు సాధించారు.అయితే గత ఐదేళ్ల కాలంలో అది మసక బారింది. రాయలసీమతో పాటు సొంత జిల్లాలో కూడా ప్రభావం తగ్గింది. దానికి కారణం కుటుంబంలో చెలరేగిన వివాదాలు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య, సోదరి షర్మిల తో జగన్ కు విభేదాలు తదితర కారణాలతో..ప్రత్యర్థులకు కడపలో పట్టు చిక్కింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురయింది.మొన్నటివరకు ఆ కుటుంబానికి ఉన్న చరిత్ర, ఆధిపత్యం పూర్తిగా సన్నగిల్లిపోయాయి. అయితే అది చేజేతులా చేసుకున్నదని ఆ కుటుంబం గుర్తించింది. జరిగిన లోపాలను సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇందుకు అంగీకరించే స్థితిలో షర్మిల లేరు.అందుకే ఆ కుటుంబంలో ఆమె ఏకాకిగా మారినట్లు ప్రచారం నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఇడుపాలపాయకు వెళ్లారు జగన్. దీంతో తల్లి విజయమ్మతో పాటు ఆ కుటుంబమంతా ఒకే వేదిక పైకి వచ్చింది. గ్రూప్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* కుమార్తెకు ఆస్తుల బదలాయింపు
ఇటీవల షర్మిల తో జగన్ కు నెలకొన్న భూవివాదం తెలిసిందే. ఓ కంపెనీకి సంబంధించిన తన వాటా ఆస్తులను విజయమ్మ కుమార్తె షర్మిలకు బదలాయించారు. దీంతో జగన్ కోర్టును ఆశ్రయించారు. తల్లి, చెల్లిపై ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వివాదం ముదిరింది. దీనిపై తల్లి విజయమ్మ ప్రత్యేక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల్లో ఇద్దరు పిల్లలకు సమభాగం అని ఆమె తేల్చి చెప్పారు. తాను కూతురి వైపే ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. దీంతో విజయమ్మ, జగన్ మధ్య భారీ గ్యాప్ ఉన్నట్లు ప్రచారం నడిచింది. దానికి తెర దించుతూ ఇడుపాల పాయలో కుమారుడు జగన్ తో కలిసి పోయారు విజయమ్మ.
* కుటుంబమంతా ఒక చోటికి
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఇడుపాల పాయకు వెళ్లారు జగన్. అక్కడ తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దానికి వైయస్సార్ కుటుంబం మొత్తం వచ్చింది. తల్లి విజయమ్మ సైతం హాజరయ్యారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటోకు దిగారు. జగన్ భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా వైఎస్సార్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దాదాపు కుటుంబమంతా ఏకమై కనిపించారు. కానీ షర్మిల మాత్రం మిస్సయ్యారు. అయితే ఆ గ్రూప్ ఫోటో వైరల్ అవుతుండడంతో వైయస్ కుటుంబ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల ఒక్కరు కలిసి పోతే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
* కుమారుడితో కలిసి పోయారా?
అయితే వైయస్ విజయమ్మలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జగన్ ఓటమికి ఒకరకంగా షర్మిల కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు కుటుంబంలో విభేదాలు వస్తే దాని పర్యవసానాలు ఏ స్థాయిలో ఉంటాయో వైసిపి ఓటమితో అర్థం అయింది. మరోవైపు ఇద్దరు పిల్లలు మధ్య నలిగిపోతున్న విజయమ్మ…. చివరకు కుమారుడికి అండగా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా కలిసేందుకు కూడా ఇష్టపడని ఆమె.. ఇప్పుడు జగన్ తో కలవడానికి అదే కారణమని తెలుస్తోంది.