AP CS: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తవారి నియామకానికి సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సమర్థ అధికారిని నియమించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈనెల తో పూర్తి కానుంది. దీంతో కొత్త సిఎస్ ఎంపిక అనివార్యంగా మారింది. అయితే చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు ప్రచారం నడుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీనియారిటీ జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. అయితే మొదటి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మీ కొనసాగుతున్నారు. అయితే ఆమె వ్యవహార శైలి అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆమె వ్యవహరించిన తీరుతో జైలుకు కూడా వెళ్లారు. అనారోగ్యానికి కూడా గురయ్యారు. చిన్న వయసులో ఐఏఎస్ అయిన ఆమె.. తన భవిష్యత్తును చేజేతులా ఇబ్బందుల్లో పెట్టుకున్నారు. జైలు నుంచి రావడంతో పాటు ఆరోగ్యంగా కోలుకోవడంతో తెలంగాణ క్యాడర్ కు వెళ్లారు ఆమె. కానీ జగన్ సీఎం అయ్యాక మళ్లీ లాబీయింగ్ చేసి.. ఏపీ క్యాడర్ కు వచ్చారు. అమరావతి రాజధాని విషయంలో అతిగా ప్రవర్తించారు. ఇప్పుడు వైసిపి అధికారానికి దూరం కావడంతో ఇప్పుడు పోస్టింగ్ కూడా లేకుండా పోయింది. అన్ని సవ్యంగా ఉంటే చంద్రబాబు సి ఎస్ గా శ్రీలక్ష్మిని తప్పకుండా అవకాశం ఇచ్చి ఉండేవారని అత్యున్నత అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
* అప్పట్లో ప్రచారం జరిగినా
వాస్తవానికి వైసీపీ హయాంలో శ్రీలక్ష్మిని సి ఎస్ గా చేస్తారని తెగ ప్రచారం నడిచింది. అప్పట్లో సి ఎస్ గా ఉన్న సమీర్ శర్మ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి ముందు వరుసలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. 1988 బ్యాచ్ కు చెందిన శ్రీ లక్ష్మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అటు తరువాత ఏపీ క్యాడర్ కు వెళ్లేందుకు ఆమె దరఖాస్తు చేసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ కేడర్ కు మారిన తర్వాత జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి పని చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెకు పోస్టింగ్ లేకుండా పోయింది.
* ఏడాది పాటు జైలులో
ఉమ్మడి రాష్ట్రంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారనే అభియోగాలతో సిబిఐ కేసు నమోదు చేసింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు కూడా తీసుకున్నారని పేర్కొంది. ఈ కేసులో చంచల్ కూడా జైల్లో శ్రీలక్ష్మి ఏడాది పాటు ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె.. సిబిఐ అభియోగాలను తప్పుపడుతూ ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె నియామకానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పోయాయి. అయినా సరే జగన్ సర్కార్ ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ సైతం ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. చేజేతులా తన కెరీర్ ను శ్రీ లక్ష్మీ పాడు చేసుకున్నారని ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి.