YCP: ఆ వర్గాలతోనే వైసీపీకి నష్టం

ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం ఏకతాటి పైకి వచ్చింది. సహజంగానే ఆ సామాజిక వర్గం టిడిపికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. కానీ చంద్రబాబు విధానాలు నచ్చక, టిడిపి ప్రభుత్వాల హయాంలో న్యాయం దక్కక చాలామంది కమ్మ సామాజిక వర్గం వారు వైసీపీ వైపు మొగ్గు చూపారు.

Written By: Dharma, Updated On : May 18, 2024 1:19 pm

YCP

Follow us on

YCP: ఏపీలో గెలుపెవరిది? ఏ పార్టీ గెలుస్తుంది? ఎన్ని స్థానాలు వస్తాయి? ఎక్కడ చూడు ఇదే చర్చ నడుస్తోంది. ఉదయం టీ షాప్ ల వద్ద, జనాలు గుమిగూడే ప్రతి సమూహం వద్ద రాజకీయ చర్చే నడుస్తోంది. పోలింగ్ శాతం పెరగడంతో కూటమిదే విజయమని విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అదంతా పాజిటివ్ ఓటింగ్ అని వైసిపి ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో ఏపీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.అయితే ఈసారి సామాజిక వర్గాల ప్రభావం అధికంగా ఉంది. ప్రభుత్వ బాధిత వర్గాలన్నీ ఏకమయ్యాయి. ఇది కూటమికి కలిసి వచ్చే అంశం. వైసిపికి ప్రతికూల అంశంగా కూడా మారింది.

ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం ఏకతాటి పైకి వచ్చింది. సహజంగానే ఆ సామాజిక వర్గం టిడిపికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. కానీ చంద్రబాబు విధానాలు నచ్చక, టిడిపి ప్రభుత్వాల హయాంలో న్యాయం దక్కక చాలామంది కమ్మ సామాజిక వర్గం వారు వైసీపీ వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో 20 శాతం వరకు కమ్మ సామాజిక వర్గం వైసీపీకి ఓటు వేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అదే సామాజిక వర్గాన్ని వేధించారన్న విమర్శ ఉంది. చంద్రబాబు పై ఉన్న కోపంతో ఆ సామాజిక వర్గంపై ఉక్కు పాదం మోపారన్న ఆరోపణ ఉంది. అందుకే ఈసారి కమ్మ సామాజిక వర్గం శత శాతం టిడిపి కూటమికి పనిచేసింది. తాము ఓటు వేయడమే కాదు.. ఆర్థిక వనరులు, ఇతరత్రా విషయాల్లో కూడా గట్టిగా పనిచేసింది.

నాటకీయ పరిణామాల మధ్య కాపు సామాజిక వర్గం కూడా కూటమికి జై కొట్టింది.2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ చేయడంతో కాపుల్లో మెజారిటీ వర్గం నాడు తెలుగుదేశం కూటమికి మద్దతు తెలిపింది. కానీ కాపుల విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమం వంటి వాటితో కాపులు వైసీపీ వైపు టర్న్ అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కాపులను పట్టించుకోలేదు. వారికోసం ప్రత్యేక పథకాలు ఏవి ప్రకటించలేదు. ఈసారి కూడా ముద్రగడ రూపంలో వైసీపీకి బలమైన నేత దొరికినా.. కాపులు మాత్రం వైసీపీని విశ్వసించలేదు. ఎన్నికల్లో కూడా మెజారిటీ కాపులు కూటమి వైపే మొగ్గు చూపారు.

మరోవైపు కూటమికి మధ్యతరగతి ప్రజలు అండగా నిలిచారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఓటు వేసేందుకు మధ్యతరగతి ప్రజలు ఇష్టపడరు. కానీ గత ఐదేళ్లుగా జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం మధ్యతరగతి వారిపై విశేషంగా ప్రభావం చూపింది. అటు సంక్షేమ పథకాలు అందక.. ఇటు అభివృద్ధి లేక మధ్యతరగతి ప్రజలు విసిగి వేసారి పోయారు. అందుకే ఎన్నడూ లేని విధంగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. ఏపీలో ఓటింగ్ పెరగడానికి కారణమయ్యారు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి ఇబ్బందికరమే. కానీ పెరిగిన ఓటింగ్ తమకు అనుకూలమని వైసిపి ప్రకటించుకోవడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. జూన్ 4న దీనిపై స్పష్టత వస్తుంది.