Jagan: వైఎస్ చెప్పినట్టు ఆ ‘రెండు పత్రికలు’ ఏమైనా చేయగలవు.. ఎలాగైనా రాయగలవు.. అసలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది జగన్ కదా!

వైఎస్ షర్మిల.. ఆ మధ్య తెలంగాణలో పార్టీ పెట్టింది. ఊరూ వాడా తిరిగింది. వాస్తవానికి ఈమె వీర సమైక్యవాది.. ఇక్కడ జనం దగ్గరికి తీయకపోయే సరికి వాస్తవం అర్థమైంది. ఆ తర్వాత ఆంధ్రకు షిఫ్ట్ అయిపోయింది. నాడు అన్న వదిలిన బాణం రూపంలో ఏ పార్టీ మీదనైతే విమర్శలు చేసిందో..

Written By: Anabothula Bhaskar, Updated On : October 26, 2024 12:20 pm

AP CM Chandrababu jagan sharmila

Follow us on

దరిద్రం.. నీచం.. నికృష్టం.. దుర్మార్గం.. అత్యంత హేయం.. దారుణం, దౌర్భాగ్యం.. ఇలా ఎన్ని పదాలైనా ఏపీ రాజకీయాలకు అన్వయించుకోవచ్చు.. ఈ మాట అనడానికి ఏమాత్రం సంశయం లేదు..

వైఎస్ షర్మిల.. ఆ మధ్య తెలంగాణలో పార్టీ పెట్టింది. ఊరూ వాడా తిరిగింది. వాస్తవానికి ఈమె వీర సమైక్యవాది.. ఇక్కడ జనం దగ్గరికి తీయకపోయే సరికి వాస్తవం అర్థమైంది. ఆ తర్వాత ఆంధ్రకు షిఫ్ట్ అయిపోయింది. నాడు అన్న వదిలిన బాణం రూపంలో ఏ పార్టీ మీదనైతే విమర్శలు చేసిందో.. అన్నీ మర్చిపోయి ఆ పార్టీ లోనే చేరింది.. అంతేకాదు అదే నోటితో అన్నను తిట్టింది. షర్మిల చేస్తున్న పని వల్ల ఓ వర్గం మస్త్ ఆనంద పడిపోయింది. ఈ కారణాన్ని ప్రముఖంగా ప్రస్తావించి.. ఓటర్ల మెప్పు పొందింది. అధికారంలోకి వచ్చింది. ఇదే క్రమంలో ఒకప్పుడు అన్న కోసం ఏపీ మొత్తం తిరిగిన చెల్లి ఇప్పుడు భ్రష్టు పట్టించింది.. అంతేకాదు ఆస్తుల సంగతి ఏంటని జగన్ ను ప్రశ్నిస్తోంది? అయితే ఇక్కడ ” నాకు విరోధులుగా ఉన్నవారితో చేతులు కలుపుతావా? నన్ను ఇబ్బంది పెడతావా? నా పరువు తీస్తావా? అందుకే తల్లి, చెల్లి ఎవరూ వద్దూ” అనే అభిప్రాయానికి జగన్ వచ్చాడు.. అయితే ఇందులో భారతి ప్రభావం లేదనడానికి లేదు. ఈ వ్యవహారం వెనక, షేర్ల బదిలీ వెనుక టిడిపి కుట్ర ఉందని జగన్ అంటున్నాడు. తన మీడియాతో రాయిస్తున్నాడు. రాజకీయ కోణం ఉందని ఆరోపిస్తున్నాడు. అఫ్కోర్స్ తను అధికారంలో ఉన్నప్పుడు.. ఐదేళ్ల కాలంలో చంద్రబాబుపై చేసింది అదే కదా. అలాంటప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు ఆలోచిస్తాడు. కానీ ఇక్కడే జగన్ ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. తనను తాను ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సందర్భాన్ని విస్మరిస్తున్నాడు.

ఒక్కడైనా ఉపయోగపడుతున్నాడా..

జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వ్యక్తికి అప్పనంగా ఓ పదవి కట్టబెట్టాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఓ సంఘటనలో అతని అవసరం జగన్మోహన్ రెడ్డికి పడింది. వెంటనే రామకృష్ణారెడ్డి ద్వారా ఫోన్ చేయించాడు. దానికి ఆ వ్యక్తి రాలేదు. పైగా తను రాజ్యాంగ పదవిలో ఉన్నానని వ్యాఖ్యానించాడు. అతడు చెప్పిన సమాధానం సజ్జలకు షాక్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి వాస్తవాన్ని పరిచయం చేసింది.. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనర్హులనే అందలం ఎక్కించాడని ఆరోపణలు ఉన్నాయి. వాసిరెడ్డి పద్మ, సజ్జల భార్గవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది.. చివరికి ఆ వాసిరెడ్డి పద్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వెళ్ళిపోయింది.

ఆ రెండు పత్రికలు మంటలను మరింతగా మండిస్తున్నాయి

ఇదే టైంలో మండుతున్న మంటలపై మరింత అగ్గి రాజేయడానికి “ఆ రెండు పత్రికలు” రంగంలోకి దిగాయి. జగన్ మీద మంటలను మరింతగా మండిస్తున్నాయి.. “షర్మిలకు రాసి ఇచ్చిన కంపెనీ ఆస్తులలో, భూములలో వేలాది కోట్ల నిక్షేపాలు ఉన్నాయి. అందువల్లే జగన్ మాట మారుస్తున్నాడు. మాట తప్పుతున్నాడు. చెల్లెలికి ద్రోహం చేస్తున్నాడని” రాసేశాయి. ఆ రెండు పత్రికల్లో బూతు భాషను ఉపయోగించే ఓ పేపర్ అయితే ఏకంగా స్పై కెమెరాలు పెట్టినట్టు రాసుకువస్తోంది.. “నేను బురద చల్లుతాను.. నువ్వు కడుక్కో” అంటూ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతోంది…

బాణానికి స్వీయ నియంత్రణ ఉండదు

మొన్నటిదాకా అవసరానికి వాడుకున్న బిజెపి ఇప్పుడు జగన్ వెంట లేదు. మీడియా జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవడం లేదు. పైగా జాతీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్వుతున్నాయి. జాతీయ మీడియా జగన్ బేలతనాన్ని చూసి డిబేట్ల మీద డిబేట్లు పెడుతోంది.  ఇలాంటిప్పుడే జగన్ మారాలి. తన నిజ మిత్రులు ఎవరో తెలుసుకోవాలి. భారతినా, మరొకరా, ఏర్పాటు చేసుకున్న మీడియానా, ఇతర వ్యక్తులా.. జగన్ లోతుగా శోధిస్తే స్క్రాప్ మొత్తం పోతుంది. అసలు వాళ్ళు మిగులుతారు.. అన్నట్టు ఈరోజు ఏపీ ఎడిషన్ లో షర్మిలను విమర్శిస్తూ తన పత్రికలో ఒక పేజీ నిండా వార్తలు రాయించాడు జగన్.. దానికి బాబు వదిలిన బాణం అని శీర్షిక పెట్టాడు.. మొన్నటిదాకా తను వదిలిన బాణం.. ఇప్పుడు ప్రత్యర్థి కాంపౌండ్ లోకి వెళ్ళింది.. జగన్ కే ఎదురు తిరుగుతోంది. వాస్తవానికి బాణానికి స్వీయ నియంత్రణ.. స్వీయ విచక్షణ ఉండదు.. వేసిన విలుకాడి తీరు ఆధారంగానే దాని గమనం సాగుతుంది. దీనిని బట్టి జగన్ ఎలా వెళ్లాలో? ఎలా ముందుకు సాగాలో? అర్థం చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా ఆత్మ విమర్శ చేసుకోవాలి.