AP Politics : నామినేట్ పదవుల్లో వాటాలే.. కూటమి మధ్య ఒప్పందం.. వారికి నో ఛాన్స్!

టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతోంది. మూడు పార్టీల శ్రేణులు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ తరుణంలోకీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 25, 2024 2:42 pm
Follow us on

AP Politics : ఏపీలో నామినేటెడ్ పదవుల నియామకంపై కసరత్తు ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. దీంతో పాలనాపరమైన నిర్ణయాల్లో సీఎం చంద్రబాబు తో పాటు పవన్ బిజీగా ఉన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడిన నేతలకు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు. సుదీర్ఘకాలం మూడు పార్టీల మధ్య పొత్తు కొనసాగాలని ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి? ఎవరెవరికి ఏ పదవులు కేటాయించాలి? అనే అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో గెలుపొందింది. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన శత శాతం విజయం సొంతం చేసుకుంది. పది స్థానాల్లో పోటీ చేసిన బిజెపి 8 చోట్ల గెలిచింది. మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో.. చాలాచోట్ల నేతలకు టిక్కెట్లు దక్కలేదు. అటువంటి వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అటువంటి వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని మూడు పార్టీలు డిసైడ్ అయ్యాయి. కూటమిలో అతిపెద్ద పార్టీగా టిడిపి ఉంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి క్యాడర్ ఉంది. జనసేన సైతం ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. గత పది సంవత్సరాలుగా పార్టీ వెన్నంటి నడిచిన నాయకులు చాలామంది ఉన్నారు.బిజెపిలో సైతం సీనియర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.ఆ పార్టీకి 10 శాసనసభ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కడంతో.. చాలామంది నేతలకు టికెట్లు దక్కలేదు. అటువంటివారు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మూడు పార్టీల్లో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు వందలాదిమంది ఉన్నారు. వారి సీనియార్టీని, సిన్సియార్టీని ప్రాతిపదికగా తీసుకోనున్నారు.

* తెరపైకి నయా ఫార్ములా
నామినేటెడ్ పదవుల విషయంలో మూడు పార్టీలు ఒక ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బిజెపికి 10% పదవులు కేటాయించనున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట ఆ పార్టీకి 60 శాతం, టిడిపికి 30 శాతం, బిజెపికి మిగతా శాతం పదవులు కేటాయించనున్నారు. బిజెపి ఎమ్మెల్యే ఉన్నచోట 50 శాతం ఆ పార్టీకి, మిగతా శాతం టిడిపి, జనసేనలకు పదవులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

* కార్పొరేషన్ పదవుల్లో వాటా
రాష్ట్రంలో దాదాపు 100 వరకు కుల కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి తోడు సలహాదారుల పదవులు కూడా ఉన్నాయి. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు సైతం ఉన్నాయి. టీటీడీ చైర్మన్ వంటి అత్యుత్తమ పదవులు కూడా ఉన్నాయి. వీటి విషయంలో కూడా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఐ.వి.ఆర్.ఎస్ పద్ధతిలో సర్వే చేస్తోంది. పార్టీలో సీనియర్లు ఎవరు? వారి పనితీరును తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. జనసేన సైతం పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన వారు వివరాలు సేకరించే పనిలో పడింది. బిజెపి సైతం పార్టీ శ్రేణుల నుంచి వివరాలు సేకరిస్తోంది.

* టిడిపికే టీటీడీ పీఠం?
తాజాగా టీటీడీ బోర్డు పూర్తిగా రద్దయింది. మొత్తం 26 మంది సభ్యులు రాజీనామా చేశారు. టీటీడీ అధ్యక్ష పీఠం ఎవరికి ఇస్తారు అన్నది తెలియాల్సి ఉంది. వీలైనంతవరకు ఆ పోస్టును తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చూస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుల విషయంలో మాత్రం మూడు పార్టీలకు భాగస్వామ్యం కల్పించనుంది. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. కొత్తగా చేరిన వారి కంటే.. ఎప్పటినుంచో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం బట్టి పదవుల శాతాన్ని విభజించడంతో.. ఒక పార్టీ విషయంలో మరో పార్టీ కలుగజేసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే వైసీపీ నుంచి చేరికల విషయంలో మాత్రం మూడు పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ తరువాతే చేరికలకు ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.