YCP Leaders : వైసీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. వారిపై వచ్చిన ఊహాగానాలు తప్పు అని తేలుతోంది. ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీకి కేవలం 11 స్థానాలు దక్కాయి.చాలామంది సీనియర్లు సైతం ఓడిపోయారు.ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల వైసిపికి ఓటమి ఎదురైంది.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది.అదే సమయంలో చాలామంది పార్టీ నేతలు గుడ్ బై చెప్పారు. ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. ఇంకోవైపు వైసీపీ హయాంలో యాక్టివ్ గా పని చేసిన నేతలు సైతం పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది.సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ కి పరిమితమయ్యారని..మాజీ మంత్రి రోజా వైసీపీని వీడుతారని.. తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. కానీ అదంతా ఉత్త ప్రచారమేనని తేలిపోయింది. కీలక నాయకులు ఎవరు జగన్ ను విడిచిపెట్టి వెళ్లరని తాజాగా స్పష్టమైంది.
* చిత్తూరు జిల్లా సమావేశానికి రోజా
చిత్తూరు జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. సమావేశానికి రోజా హాజరయ్యారు. గతంలో ఎప్పుడు కనిపించని కొత్త లుక్ తో రోజా ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. ఓటమి ఎదురైన తర్వాత రోజా పెద్దగా కనిపించడం మానేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా కనిపించలేదు. అదే సమయంలో తరచూ తమిళనాడులో దర్శనమిచ్చేవారు. అక్కడ సీఎం స్టాలిన్ ను కలిసేవారు. దీంతో ఆమె డిఎంకెలో చేరతారని ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో సైతం వైసిపి ఆనవాళ్లను తొలగించేశారని టాక్ నడిచింది. మరోవైపు విజయ్ దళపతి కొత్త పార్టీలో రోజా చేరతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ చిత్తూరు జిల్లా నేతల సమావేశానికి హాజరై ఈ ప్రచారానికి చెక్ చెప్పారు రోజా.
* సజ్జల సైతం హాజరు
మరోవైపు పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ అధికార ప్రతినిధిగా, సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు సజ్జల. వైసిపి దారుణ పరాజయానికి సజ్జల కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున విశ్లేషణలు కూడా వచ్చాయి. మరోవైపు సజ్జలకు కేసుల భయం వెంటాడుతోందని.. ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం సాగింది. ఇంకోవైపు సజ్జల హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారని.. కొన్ని కేసుల విషయంలో ముందస్తు బెయిల్ ప్లాన్ లో ఉన్నారని టాక్ నడిచింది. కానీ వాటన్నింటికీ చెక్ చెబుతూ సజ్జల జగన్ వెంట తాజాగా కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి ఆయన పార్టీలో యాక్టివ్ అవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
* ఓటమి నైరాశ్యం నుంచి బయటపడి
ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 100 రోజులు అవుతోంది. వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుంచి బయటపడుతున్నారు. రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. పరామర్శల పేరిట వైసీపీ శ్రేణులను కలుస్తున్నారు. అదే సమయంలో గతంలో యాక్టివ్ గా పని చేసిన కీలక నేతలు సైతం జగన్ వెంట కనిపించడం ప్రారంభించారు. దీంతో గత 100 రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలింది. అయితే వేరే పార్టీలో చేరేందుకు ఛాన్స్ లేని వైసిపి నేతలు మాత్రమే యాక్టివ్ అవుతుండడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More