Junior NTR : చంద్రబాబుతో గ్యాప్ తగ్గించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారా? వారి మధ్య విభేదాలకు చెక్ చెప్పనున్నారా? నందమూరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును కలవనున్నారు. అమరావతి వెళ్లి వరద బాధితులకు 50 లక్షల రూపాయల చెక్ ను అందించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి అమరావతి వెళ్లనున్నారు. ఇటీవలే వరద బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ కలవనున్నారు. దీంతో ఇదోప్రాధాన్య అంశంగా మారిపోయింది.సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కోనేళ్లుగా చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ విభేదిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.అందుకు తగ్గట్టుకే వారి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. బాబాయ్ నందమూరి బాలకృష్ణ తో పాటు నారా కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ కలిసింది చాలా తక్కువ. మొన్నటి ఎన్నికల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పార్టీకి పెద్దగా పనిచేయలేదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎటువంటి పిలుపు ఇవ్వలేదు. రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు మాత్రం తెలిపారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా తారక్ హాజరు కాలేదు. దీంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయని టాక్ నడిచింది. ఇటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును కలవాలని భావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* 2009లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారం
2009లో టిడిపికి మద్దతుగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్.కానీ ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాలేదు.అప్పటినుంచి క్రమేపీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.చంద్రబాబు సైతం ఆయనను దూరం పెట్టినట్లు ప్రచారం జరిగింది. బాలకృష్ణ తో సైతం తారక్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. నందమూరి కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు రాజకీయపరమైన అంశాల జోలికి జూనియర్ ఎన్టీఆర్ ఎన్నడు పోలేదు. పార్టీ క్లిష్ట సమయంలో సైతం తారక్ ఎటువంటి ప్రకటనలు చేయలేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది.
* అంతంతమాత్రంగానే స్పందన
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కామెంట్స్ చేశారు. అయితే అప్పుడు కూడా తారక్ గుడి పొడి పొడిగా స్పందించారు. నేరుగా ఖండించలేదు. తన మేనత్త విషయం ప్రస్తావించలేదు. మహిళలను గౌరవించాలని మాత్రమే సూచించారు. అటు తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో సైతం భిన్నంగా స్పందించారు. నందమూరి తారక రామారావు తో పాటు వైయస్ రాజశేఖర్ రెడ్డిని లెజెండ్రీ పర్సన్స్ గా మాత్రమే అభివర్ణించారు. వైసిపి ప్రభుత్వ చర్యలను తప్పు పట్టలేదు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో సైతం తారక్ స్పందించిన దాఖలాలు లేవు. దీంతో టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ అంటే మండిపడేలా పరిస్థితి వచ్చింది.
* ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు గైర్హాజరు
నందమూరి కుటుంబ సభ్యుల కార్యక్రమాలకు సైతం జూనియర్ ఎన్టీఆర్ హాజరు అంతంత మాత్రమే. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలకు ఆయన గైర్హాజరయ్యారు. ప్రత్యేకంగా ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరైన ఈ కార్యక్రమానికి ముఖం చాటేసారు. మొన్నటికీ మొన్న నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ జీవిత వేడుకలకు సైతం హాజరు కాలేదు. దీంతో దాదాపు తారక్ ఒక నిర్ణయానికి వచ్చారని.. నందమూరి, నారా కుటుంబానికి దూరంగా ఉంటున్నారని ప్రచారం ప్రారంభమైంది. అయితే దానికి చెక్ చెబుతూ నేరుగా ఈరోజు రామ్ చరణ్ తో కలిసి చంద్రబాబును కలవనున్నారు తారక్. అయితే వారి మధ్య విభేదాలకు ఇక్కడితో చెక్ పడతాయని నందమూరి అభిమానులు ఆనందపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More