TTD Laddu Issue : తిరుమలలో వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ, ఇద్దరు ఏపీ పోలీస్ అధికారులు, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి ఒకరిని నియమిస్తూ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొద్ది రోజుల కిందట ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అని సంచలన ఆరోపణలు చేశారు. అప్పటినుంచి రచ్చ ప్రారంభమైంది. ఈ విషయంలో వైసీపీ కార్నర్ అయింది. నాడు ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలు ఖండించారు. జగన్ సైతం మీడియా ముందుకు వచ్చి ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. దీంతో టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆరోపించింది వైసిపి.చంద్రబాబు సర్కార్ సిట్ ఏర్పాటు చేయడంతోతమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించింది.అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసిపి. టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కోర్టులో ప్రత్యేకమైన పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైసిపి కోరిక మేరకు కోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక సిట్ విచారణ కొనసాగించనుంది. అయితే దీనిని ఆహ్వానించారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం పార్టీ నేతలతో చర్చించేందుకు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
* తమ వాదన నెగ్గిందని ప్రకటన
ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించిన తర్వాత.. తమ వాదన నెగ్గిందని వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అధికారులతో ఏర్పాటైన సిట్ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి రావని.. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరిగే సిట్ తో లడ్డు విషయంలో అసలు రాజకీయం బయటకు వస్తుందని వైవి అభిప్రాయపడ్డారు.అయితే వైసిపి ఆశించినట్టు ఇక్కడ జరగలేదు.కేవలం సిబిఐ దర్యాప్తును కోరుకుంది వైసిపి.సింగిల్ జడ్జి విచారణ ఉంటుందని ఆశించింది. కానీ అత్యున్నత న్యాయస్థానం దీనిని రాజకీయ కోణంలో చూడలేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా ఇబ్బందులు రాకూడదని ఉద్దేశంతో ఇద్దరు చొప్పున కేంద్ర, రాష్ట్ర అధికారులతో కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది.
* ఇద్దరు సిబిఐ అధికారులు కలిశారు
రాష్ట్ర ప్రభుత్వం 11 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ బృందం తొలివిడత దర్యాప్తును ముగించింది. డిజిపి కి నివేదిక కూడా ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు అభ్యంతరకర వ్యాఖ్యలతో ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ నిలిపివేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉండే ఆ ఇద్దరు పాత సిట్ లో ఉండేవారా? లేకుంటే కొత్త వారిని నియమిస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ పాత సిట్ లో ఉన్న వారిని నియమిస్తే వైసిపి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే సిబిఐ అధికారులు ఇద్దరు అదనంగా సిట్ లోకి వస్తారు. ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ వివాదంపై ముందుగా మాట్లాడేది వైసిపి నేతలే. అందుకే సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి ఫేవర్ చేయలేదు.వైసిపి ఆశించినట్టు కూడా లేవు.