Vanga Geetha: ఉప ఎన్నిక వేరు.. సార్వత్రిక ఎన్నికలు వేరు. ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ శక్తియుక్తులన్నింటినీ అక్కడ ప్రదర్శిస్తుంది. సర్వశక్తులు ఒడ్డుతుంది. గెలుపు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్న చేసింది అదే. టిడిపి ప్రభుత్వ హయాంలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది. నిన్న తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం వైసిపి సులువుగా గెలవ గలిగింది. అక్కడ పార్టీ పరిశీలకులు, బాధ్యులు అలా పని చేస్తారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో అది కుదిరే పని కాదు. ఎవరి నియోజకవర్గం వారు చూసుకోవాల్సిందే. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో.. ఆయనపై మహిళా అభ్యర్థిని పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారు. వంగా గీతను పెట్టారు. అయితే అభ్యర్థిని ప్రకటించిన వరకు ఉన్న ఉత్సాహం.. ఇప్పుడు లేకుండా పోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.అటు పార్టీ శ్రేణులు కూడా వంగా గీతను పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో ఇక్కడ పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈసారి ఆయన జగన్ తప్పించారు. దీంతో దొరబాబు జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. దొరబాబును తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకున్న జగన్.. వైసీపీ అధికారంలోకి వస్తే గౌరవప్రదంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో గీత గెలుపును ఆయనకు అప్పగించారు. ఇందుకు దొరబాబు కూడా అంగీకరించారు. వంగా గీతతో కలిసి ప్రచారం కూడా చేశారు. అయితే రాను రాను దొరబాబు కనిపించకుండా పోతున్నారు. అదే సమయంలో దొరబాబు అనుచరులు పెద్ద ఎత్తున జనసేనలో చేరుతున్నారు. దొరబాబు దగ్గరగా ఉండి వైసీపీ శ్రేణులను జనసేనలో చేర్చుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న ధ్యేయంతో జగన్.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి రప్పించారు. ఆయన ద్వారా కాపు నేతలను వైసీపీ వైపు తిప్పించుకునేలా ప్లాన్ చేశారు. అందులో భాగంగా పిఠాపురం జనసేన ఇన్చార్జ్ మాకినీడి శేషు కుమారిని వైసీపీలో చేర్పించారు. 2019 ఎన్నికల్లో ఆమెకు 28 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కానీ ఎన్నికల అనంతరం అంతగా యాక్టివ్ గా లేరు. కానీ పవన్ కళ్యాణ్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా శేషు కుమారిని వైసీపీలో చేర్పించారు. కానీ ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అటు జగన్ మిథున్ రెడ్డిని పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తగా నియమించారు. కానీ ఆయన రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా బరిలో దిగుతుండడంతో మిధున్ రెడ్డి క్షణం తీరిక లేకుండా గడపాల్సి వస్తోంది. దీంతో పిఠాపురంలో సమన్వయం చేసేవారు లేకపోతున్నారు. వంగా గీత.. సాక్షి మీడియా ప్రతినిధులతో కొద్దిపాటి హడావిడి చేస్తున్నారు. ప్రచారం విషయంలో సైతం పెద్దగా ఖర్చు చేయడం లేదని సొంత పార్టీ శ్రేణులే కామెంట్స్ చేస్తున్నాయి. మొత్తానికైతే పిఠాపురంలో జరుగుతున్న వ్యవహారంలో వైసిపి చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. పవన్ చెబుతున్నట్టు లక్ష మెజారిటీ కాకున్నా.. రఘురామకృష్ణంరాజు చెబుతున్నట్టు 60 వేల కు పైగా మెజారిటీ మార్కు దాటే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.