Bandi Sanjay: కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల రేసులో బండి సంజయ్ టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన సిట్టింగ్ ఎంపీ సంజయ్.. షెడ్యూల్ వచ్చాక స్పీడు మరింత పెంచారు. ఒక రకంగా చెప్పాలంటే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కరీంసగర్ అంటే సంజయ్ అనేలా ప్రచారం జోరు పెంచారు.
బీఆర్‌ఎస్‌లో నిర్లిప్తత..
ఇక కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోమారు వినోద్‌కుమార్ పోటీ చేయబోతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఆయన ప్రచారంలో తడబడుతున్నారు. కేడర్ కలిసి రాకపోవడం, బీఆర్‌ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతుండడంతో కేడర్‌లో అయోమయం నెలకొంది. దీంతో వినోద్‌రావుకు కేడర్ కలిసి రావడం లేదు. మరోవైపు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు భూకబ్జాల కేసులు వరుసగా అరెస్టు అవుతున్నారు. వారికి ఇటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గానీ, అటు ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌గానీ అండగా నిలిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సెకండ్ కేడర్ అయోమయంలో ఉంది. వినోద్ మార్నింగ్ వాక్‌ల పేరుతో ప్రజలను కలిసి మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ కేడర్ కూడా లోక్‌సభ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
అభ్యర్థినే ప్రకటించని కాంగ్రెస్..
ఇక అధికార కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుస్తామని ధీమాగా చెబుతోంది. కానీ, ఇప్పటి వరకు ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటి వరకు 14 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలోనూ గందరగోళం నెలకొంది. బలమైన బండి సంజయ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు దీటుగా ఉండే నేతను పోటీకి దించాలని భావిస్తోంది. ఇక టికెట్ కోసం వెలిచాల రాజేందర్‌రావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఆశిస్తున్నారు. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో అధిష్టానం తేల్చుకోలేకపోతోంది. దీంతో కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం కనిపించలేదు.
సంజయ్ దూకుడు.. బీజేపీలో జోష్..
ఇక బీజేపీ సిటింగ్ ఎంపీ, మరోమారు పోటీ చేస్తున్న బండి సంజయ్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలతో బీజేపీ కేడర్‌లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే సంజయ్ పాదయాత్ర చేశారు. షెడ్యూల్‌కు ముందే.. ఆయోధ్య రామ మందిరం చిత్ర పటాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రైతు దీక్ష చేశారు. పంటలు ఎండుతున్న రైతుల వద్దకు వెళ్లి పరామర్శిస్తున్నారు. తాజాగా చేనేత కార్మికుల సమస్యలపై దీక్షకు సిద్ధమయ్యారు. భీమ్ యాత్ర కూడా చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మొత్తంగా ప్రజల సమస్యలను ఎజెండాగా మలుచుకుని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్, గత బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను మడతపెట్టి కొడుతున్నారు. కరీంనగర్‌లో మళ్లీ కాషాయ జెండా ఎగరేస్తామన్న ధీమాతో ఆ రెండు పార్టీలకు అందకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు.