Sakshi Vs Eenadu: మార్గదర్శి మీద చర్యలు ఎలా తీసుకోవాలో నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి తెలియలేదు గాని.. జగన్ మాత్రం అదును చూసి దెబ్బ కొడుతున్నాడు. ఆఫ్ కోర్స్ ఇందులో ఉండవల్లి అరుణ్ కుమార్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి జగన్ పని ఈజీ అవుతున్నది. ఇప్పటికైతే ఎన్నికల ముందు రామోజీరావుకు మార్గదర్శి వ్యవహారం వల్ల కొంత ఇబ్బందే. ఆ ఇబ్బందుల్లో, ఆ విషాదంలో ఉన్న రామోజీరావుకు.. ఒకింత సాంత్వన కలిగించే విషయం ఇది. ఎందుకంటే రామోజీరావు మానస పుత్రికల్లో మార్గదర్శి తర్వాత స్థానమైన ఈనాడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది కాబట్టి.. ఎప్పటినుంచో ఈనాడు నెంబర్ వన్ గా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవడం గొప్ప విషయమే.
ఇక పత్రికల కొలమానానికి సంబంధించి ఏబీసీ (audit bureau of circulation) గణాంకాలు విడుదలయ్యాయి. దాని ప్రకారం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర మెట్రో నగరాలు కలుపుకుంటే ఈనాడు తిరుగులేని స్థానంలో ఉంది. 2022లో 13.50 లక్షల కాపీల సర్కులేషన్ ఉంటే.. 2023లో అది 35 వేలకు తగ్గి.. 13.15 లక్షలకు చేరుకుంది. కోవిడ్ సమయంలో పతనంతో పోలిస్తే ఒకరకంగా అది చాలా తక్కువే. వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో ఈనాడు ప్రింట్ కాపీల మీద దృష్టి కేంద్రీకరించే పరిస్థితి లేదు. డిజిటల్, టీవీ మీదే రామోజీరావు దృష్టి సారిస్తున్నారు. (ఏపీలో సాక్షి నెంబర్ వన్ స్థానంలోకి రాకుండా ఉండేందుకు.. జగన్ మీద ప్రచారానికి.. జనంలోకి ఇంకా ఎక్కువ పోవడానికి.. లక్షల కాపీలు డంప్ చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉన్నాయి) ఈటీవీ భారత్ వల్ల చెయ్యి కాలుతున్నప్పటికీ రామోజీరావు తన డిజిటల్ ప్రయత్నాన్ని మానుకోవడం లేదు. ఇక పత్రికలకు ఏబీసీ గణాంకాల ఆధారంగానే ప్రకటనలు వస్తాయి. ఆ ఏబీసీ గణాంకాలలో ఈనాడు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రింట్ మీడియాను ఎవడూ దేకడం లేదు కాబట్టి యాడ్ టారిఫ్ తగ్గిస్తోంది. రాయితీలు ఇస్తోంది. రెవెన్యూ కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతోంది.
ఇక సాక్షి విషయానికొస్తే 2022లో దాని సర్కులేషన్ 10 లక్షలు గా ఉండేది. గత ఏడాది 30 వేలు పెరిగి 10 లక్షల 30 వేలకు చేరుకుంది. ఏపీలో ప్రభుత్వం ఉంది కాబట్టి.. వలంటీర్లకు ప్రత్యేకంగా జీవో ఇచ్చింది కాబట్టి ఈ పెరుగుదల ఉందని భావించినప్పటికీ.. అది 30 వేలకు మించలేదు. ఈనాడును బీట్ చేయలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఈనాడు కంటే సాక్షి చాలా పూర్.. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఈనాడు కంటే సాక్షి చాలా బెటర్ పొజిషన్లో ఉంది. ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో ఈనాడు కంటే కాస్త ఎక్కువగా ఉంది. ఇక మిగతా జిల్లాల్లో ఈనాడును బీట్ చేయలేకపోతోంది. భారీ స్థాయిలో సాధనా సంపత్తి ఉన్నప్పటికీ.. దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని దుస్థితి సాక్షిది. ఇవాల్టికి ఈనాడుకు మించి మ్యాన్ పవర్ ఆ పత్రికకు ఉంది. కానీ ఏం ఉపయోగం? చివరికి ఆ జగన్మోహన్ రెడ్డికి కూడా సాక్షి ఉపయోగపడదు. అందుకే ఆయన నాకు సొంత మీడియా లేదని పదేపదే చెప్తుంటారు.
ఇక మూడో పత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అది ఈనాడులో దాదాపు నాలుగో వంతు. సాక్షిలో మూడో వంతు. 2022 తో పోలిస్తే 2023లో దానికి కాపీలు 300కు పెంచుకుంది. దమ్మున్న పత్రిక అంటూ వేమూరి రాధాకృష్ణ గప్పాలు కొడుతుంటాడు గాని క్షేత్రస్థాయిలో దానికి అంత సన్నివేశం లేదు. 2022లో 3.87 లక్షలు దాని సర్కులేషన్. 2023 లోనూ దాదాపు అంతే. ఏపీలో 2.34 లక్షలతో మూడో స్థానంలో ఉంది. వాస్తవానికి రాధాకృష్ణ ప్రింట్ మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడో పక్కన పెట్టాడు. టీవీ మీద దృష్టి పెట్టాడు. కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు ఇలా నలుగురు చేతికి అందువచ్చిన తర్వాత డిజిటల్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆంధ్రజ్యోతి మాత్రమే కాదు ఈనాడు, సాక్షి యాజమాన్యాలది కూడా సేమ్ అదే పొజిషన్. స్మార్ట్ ఫోన్ ద్వారా అరచేతిలో ప్రపంచం ఇమిడి పోతున్న ఈ రోజుల్లో చాలామంది డిజిటల్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలో వచ్చే ఎన్నికల తర్వాత.. ఇప్పుడు యాజమాన్యాలు చేస్తున్న పేపర్ డంపింగ్ పూర్తిగా తగ్గిపోవచ్చు. అప్పుడు అసలైన పాఠకాదరణ తేటతెల్లమవుతుందనే వాదన కూడా ఉంది.
ఇక తెలుగు పత్రికల్లో ఏబీసీ సర్టిఫికేషన్ ఉండేది 3 పత్రికలకు. భారత రాష్ట్ర సమితి అధికారిక కరపత్రం నమస్తే తెలంగాణ ఎప్పుడో ఏబీసీ నుంచి బయటికి వచ్చింది. మిగతా పత్రికలు ఏబీసీ వైపు వెళ్ళలేదు. అసలు లెక్కలు బయటకు వస్తే ప్రకటనలకు ఇబ్బంది, పైగా ఆ మూడు ప్రధాన పత్రికలు మినహా మిగతా వాటిని పెద్దగా ఎవరూ చదవరు. ఈ జాబితాలో వెలుగు కొంచెం బెటర్ అయినప్పటికీ.. దాని యాజమాన్యం టీవీ మీద కాన్సెంట్రేట్ చేస్తోంది. ప్రింట్ మీడియాను పెద్దగా పట్టించుకోదు.