Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ హైదరాబాదులో ఉన్నారా? అమెరికా వెళ్లిపోయారా? అరెస్టుకు రంగం సిద్ధం!

అత్యంత వివాదాస్పదమైన నేతల జాబితాలో వల్లభనేని వంశీ చేరిపోయారు. టిడిపి నుంచి గెలిచి.. ఆ పార్టీ అధినేత పైనే విమర్శలు చేశారు. చంద్రబాబు కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Written By: Dharma, Updated On : August 2, 2024 9:56 am
Follow us on

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆయన అరెస్టు తప్పదా? ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ వెళ్లాయా? ఆయన హైదరాబాదులో ఉన్నారా? లేకుంటే అమెరికా వెళ్లిపోయారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. వైసిపి హయాంలో గన్నవరం టిడిపి కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. దీని వెనుక వల్లభనేని వంశీ హస్తం ఉందని అప్పట్లోనే అనుమానాలు ఉన్నాయి. వైసీపీ కార్యాలయంలో ఉంటూ.. ఆయన డైరెక్షన్ లోనే దాడులు జరిగాయి అన్నది ప్రధాన ఆరోపణ. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి కేసులపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి పెద్ద ఎత్తున వైసిపి శ్రేణులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ 73గా వంశీ మోహన్ ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని కూడా టాక్ నడిచింది. అయితే ఎటువంటి అరెస్టు లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉండేది. అయితే జిల్లాకు కొత్తగా ఎస్పీ రావడంతో.. ఈ పాత కేసు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ కు మూడు పోలీసు బృందాలను పంపించినట్లు తెలుస్తోంది.

* 2014లో అసెంబ్లీలోకి..
2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేశారు వల్లభనేని వంశీ మోహన్. ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో సైతం టిడిపి అభ్యర్థిగానే గెలిచారు. కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. వెళ్తూనే చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. వారిద్దరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో వంశీ ముందుండేవారు. ఒకానొక దశలో చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాస్పదుడిగా మారారు. టిడిపి శ్రేణులకు వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యారు. కానీ అప్పట్లో అధికార పార్టీలో ఉండడంతో దూకుడుగా ముందుకు సాగారు వంశీ.

* ఈ ఎన్నికల్లో ఓటమి
ఈ ఎన్నికల్లో ఎలాగైనా వల్లభనేని వంశీని ఓడించాలని చంద్రబాబు వ్యూహం పన్నారు. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావును పిలిపించి టిడిపి టికెట్ కేటాయించారు. అష్టదిగ్బంధం చేయడంతో వల్లభనేని వంశీకి ఓటమి తప్పలేదు. ఏపీలో ఒక సైతం టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఓటమి తర్వాత కనీసం గన్నవరంలో వంశీ అడుగు పెట్టలేదు. విజయవాడలో ఉన్న బయట ప్రపంచానికి రాలేదు. ఆయన అమెరికా వెళ్ళిపోతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నట్టు సమాచారం అందడంతో పాత కేసులో అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

* పోలింగ్ తర్వాత అమెరికాకు
వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం పట్టు బిగించినట్లు సమాచారం. ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఇక తిరిగి రారని ప్రచారం జరిగింది. కానీ కౌంటింగ్ ముందు గన్నవరం నియోజకవర్గానికి చేరుకున్నారు. అయితే కౌంటింగ్ తర్వాత కొడాలి నానితో కలిసి బయటకు వెళ్ళిపోయారు. అప్పటినుంచి అజ్ఞాతంలోనే గడిపారు.అసలు ఆయన హైదరాబాదులో ఉన్నారా? లేకుంటే అమెరికా వెళ్లిపోయారా? అన్నది తెలియడం లేదు. ఆయన అరెస్టు జరిగితే కానీ దీనిపై క్లారిటీ రాదు.