AP Volunteer System : ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై బలమైన చర్చ నడుస్తోంది. ఇటువంటి సమయంలో దీనిని అనుకూలంగా మార్చాలని తాడేపల్లి ప్యాలెస్ రకరకాలుగా వ్యూహాలు పన్నుతోంది. దానికి ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ టీమ్ స్కెచ్ గీస్తోంది. ఒక వైపు వలంటీర్లను రోడ్డెక్కిస్తూనే వందీమాగధులను రంగంలోకి దించుతోంది. నీలి మీడియా, కూలి మీడియా, సినిమా రంగంలో తమకు అనుకూలమైన వారిని ముందు పెట్టి నాటకం ఆడుతోంది. ఇక మేధావి వర్గం నుంచి కొంతమంది తెరపైకి వస్తున్నారు. మరికొందరు విశ్లేషకులు అంతుపట్టని విధంగా విశ్లేషణలు చేసి ప్రజల్లో ఒక రకమైన మార్పును తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. విచిత్రమేమిటంటే కొంతమంది విదేశీ నిపుణులు వలంటీరు వ్యవస్థపై గొప్పగా నిర్వచనాలు, అభిప్రాయాలిచ్చారంటూ చెబుతుండడం విశేషం.
వలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రానికి గొప్ప నాయకత్వం వస్తుందంటూ ఒక స్లోగన్ బయటకు పంపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు వలంటీర్లను పోటీలో పెట్టాలని చూస్తున్నారు. పవన్ పై ఏకంగా వలంటీరును పోటీలో పెడతామని ప్రచారం చేస్తుండడం అందులో భాగమే. సగటు విద్యార్థి, యువకుడికి ప్రభుత్వ శాఖలపై అవగాహన లేదని.. కానీ రెండున్నర లక్షల మంది వలంటీర్లకు ప్రభుత్వ శాఖలు, వాటి తీరుపై స్పష్టమైన అవగాహన ఉందని.. భవిష్యత్ వారే నాయకులుగా మారుతారని.. అందుకే వారికి ప్రోత్సాహం అందించాల్సిన అవసరముందని కొందరు మేథావులు చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పటికే ఉన్న ప్రజాప్రతినిధి వ్యవస్థను, అధికార, ఉద్యోగ గణాన్ని మాత్రం అసమర్థులుగా చిత్రీకరిస్తుండడం మాత్రం విచిత్రంగా ఉంది.
ఏపీలో రెవెన్యూ, పోలీస్,రిజిస్ట్రేషన్ శాఖలు అవినీతిగా మారాయని.. అసమర్థంగా ఉన్నాయన్న కొత్త వాదనకు కూడా పదును పెడుతున్నారు. ఒక బలమైన ప్రభుత్వ శాఖలను సమాంతర రాజకీయ వ్యవస్థ కంటే చులకన చేయాలని చూడడం అత్యంత హేయమైన చర్య. ఒక అచ్చమైన రాజకీయ క్రీడగా కనిపిస్తోంది. ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు సరిచేయాల్సి ఉంటే.. ఆ వైఫల్యాల నుంచి తమకు తాము అధిగమించేందుకు యంత్రాంగాన్ని బలి పశువుగా పెడుతున్నారు.
ఇప్పటికే గ్రామస్వరాజ్యాన్ని సచివాలయాలకు తాకట్టు పెట్టేశారు. రాజ్యాంగబద్ధమైన స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. వాటి ప్రతినిధుల రెక్కలను తొలగించి నడి వీధిలో నిలబెట్టారు. ఒక్క వలంటీరు వ్యవస్థకు అల్టిమేట్ పవర్స్ ఇచ్చారు. కానీ వారిని రిమోట్ చేసే అతిపెద్ద సాధనాన్ని తన వద్ద పెట్టుకున్నారు. అంటే ఇందులో పాత్రధారులు, సూత్రధారులు అంతా నిమిత్త మాత్రులే. సూపర్ పవర్ మాత్రం ఒక్కరే అనుభవిస్తున్నారు. అసలు సిసలు రాజకీయం చేసి ఏపీ ప్రజలను, యంత్రాంగాన్ని, చివరకు తనతో ఉండే పాలకులను సైతం జోకర్లుగా మార్చుకున్నారు. క్రిమినల్ మైండెడ్ పాలనతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.