TDP Media: మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు అనుకూలమని అంతా భావిస్తారు. కానీ ఆ మీడియా సంస్థలకు సైతం వ్యక్తిగత అజెండాలు ఉంటాయి. తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి అనుకూల మీడియా ఒక దాని పరిస్థితి అంతే. ఆ మీడియా అధినేత నిత్యం ప్రభుత్వానికి చంద్రబాబుకు సూచనలు చేస్తూనే ఉంటారు. వారాంతపు కామెంట్స్ తో తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక సలహాదారుడు. అయితే తెలుగుదేశం పార్టీకి మంచి జరిగితే తాను చెప్పానని.. చెడు జరిగితే మాత్రం తన సూచనలను పాటించలేదని నిత్యం చెబుతుంటారు. అయితే అది టిడిపి ముద్ర పడిన మీడియా. కానీ కొంతమంది టిడిపి సీనియర్లు మాత్రం ఆ మీడియాను విశ్వసించరు. చివరకు నందమూరి బాలకృష్ణ సైతం సదరు మీడియాను వ్యతిరేకిస్తుంటారు. అయితే టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా జంగా కృష్ణమూర్తి రాజీనామా వెనుక ఆ మీడియా అతి ఉంది.
కొద్ది నెలల కిందట టిడిపిలో చేరిక..
2024 ఎన్నికల్లో జంగా కృష్ణమూర్తి( janga Krishnamurthy) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే జంగా కృష్ణమూర్తి సేవలను వాడుకున్నారే తప్ప.. ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు. దీంతో ఇటీవల ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనను టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నియమించారు. సహజంగానే భక్తి భావం ఎక్కువగా ఉండే జంగా కృష్ణమూర్తి గతంలో కూడా టీటీడీ సభ్యుడిగా వ్యవహరించేవారు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ కోరినా టీటీడీ స్పందించలేదని.. కానీ జంగా కృష్ణమూర్తికి అనుకూలంగా వ్యవహరించిందని చెబుతూ టిడిపి అనుకూల మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే తన అభిప్రాయం తీసుకోకుండా వ్యతిరేక కథనం రావడంతో మనస్థాపానికి గురయ్యారు జంగా కృష్ణమూర్తి. తన వల్ల ప్రభుత్వానికి కానీ.. సీఎం చంద్రబాబుకు కానీ చెడ్డ పేరు రాకూడదని ఏకంగా పదవికి రాజీనామా చేశారు. దీంతో సదరు టిడిపి అనుకూల మీడియాపై ఇప్పుడు పార్టీలో చర్చ నడుస్తోంది.
రెండు దశాబ్దాల కిందట..
రెండు దశాబ్దాల కిందట జంగా కృష్ణమూర్తి టీటీడీలో( Tirumala Tirupati Devasthanam) కాటేజీల నిర్మాణం కోసం కొంత భూమిని తీసుకున్నారు. అయితే దానికి కొంత డిపాజిట్ గా కూడా కట్టారు. అయితే ఆర్థిక వెసులుబాటు ఇవ్వాలని కోరుతూ రాగా.. ఆ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది. వైసిపి హయాంలో సైతం అప్పటి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈవో గా ఉన్న ధర్మారెడ్డి అడ్డుకున్నారు. ఇప్పుడు సభ్యుడు కావడం.. టీటీడీలో ఈ అంశం చర్చకు రావడం.. ఒకే ఒక్క సభ్యుడు తప్ప మిగతా వారంతా ఆమోదించడంతో ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే ఆ టిడిపి అనుకూల మీడియా అదే పనిగా కథనాలు ప్రచురించింది. పైగా పవన్ కళ్యాణ్ చేసిన విన్నపాన్ని తిరస్కరించినట్లు పేర్కొంది. అయితే తన వల్ల చంద్రబాబుతో పాటు ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదని జంగా కృష్ణమూర్తి పదవికి రాజీనామా చేశారు.
అంతా సొంత అజెండా..
అయితే టిడిపి అనుకూల మీడియా విషయంలో పార్టీలో ఒక రకమైన చర్చ ఉంది. ఆ మీడియాకు సొంత అజెండా ఉంటుందన్న ప్రచారం ఉంది. టిడిపిని వ్యతిరేకించే ఒక సామాజిక వర్గం వారిని సైతం ఆ మీడియా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఆ మీడియా అధినేత అదే సామాజిక వర్గం కాబట్టి. సినీ వర్గాలతో పాటు వివిధ రంగాల్లో చాలామంది ప్రముఖులు టిడిపి తో పాటు చంద్రబాబును వ్యతిరేకిస్తుంటారు. అటువంటి వారికి ఆ మీడియాలో చోటు ఉంటుంది. ఎందుకంటే వారు ఆ మీడియా అధినేత సామాజిక వర్గానికి చెందినవారు కావడమే. మరోవైపు టిడిపిలో ఉన్న మిగతా సామాజిక వర్గంలోని సీనియర్లకు సైతం ఆ మీడియా చిన్నచూపు చూస్తుంది. అందుకే బాలకృష్ణ వంటి వారు సైతం ఆ మీడియా అంటే పెద్దగా ఆసక్తి చూపరు. బాలకృష్ణ వార్తలు సైతం ఆ మీడియాలో రావు. మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీకి ఆ మీడియా వరమో.. శాపమో అర్థం కాదు.