వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిలకు ఎంతో గుర్తింపు ఉంది. అన్నా చెల్లెలుగా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ, ఇది ఒకప్పటి మాటగా మారిపోయింది. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని.. అన్నకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉన్న రాజకీయ అవసరాల ద్రుష్ట్యా ఆ రాష్ట్రంలో తన పార్టీని కూడా లేకుండా చేసుకుని జగన్ తనదైన వ్యూహంతో ముందుకు వెళుతుండగా.. షర్మిల మాత్రం కేసీఆర్ ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. అంతటితో ఆగకుండా జగన్ వ్యతిరేకులతోనూ చేతులు కలిపే దిశగా అఢుగులేస్తున్నారు. జగన్ అంటే గిట్టని ఓ మీడియా సంస్థ అధినేతకు షర్మిల ఇంటర్వ్యూ ఇవ్వడం, ఏకంగా ఆ సంస్థ కు వెళ్లడంతో ఇది మరింత పరాకాష్టకు చేరినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వాస్తవానికి తన అన్న జగన్ కోసం ఎంతో కష్టపడ్డారు. అక్రమాస్తుల కేసులో జగన్ ఏడాదిన్నర కాలం జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టి.. పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. ఎండనకా, వాననకా వేల కిలోమీటర్లు నడిచి.. అన్న జైలు నుంచి బయటికి వచ్చేదాకా పార్టీని నిలబెట్టారు. దీంతో, జగన్ జైలు నుంచి విడుదలయ్యాక వైసీపీలో షర్మల నెంబర్ 2 అవుతారని అంతా భావించారు. కానీ, పరిస్థితులు ఎవరూ ఊమించని విధంగా తారుమారయ్యాయి.
తొలుత వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు, ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చినప్పుుడు షర్మిలను జగన్ పట్టించుకోలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక షర్మిలకు మంచి పదవే వస్తుందని భావించినా .. ఆమెను జగన్ పూర్తిగా దూరం పెట్టేశారు. షర్మిల కొన్ని సిఫారసులు చేసినా పక్కన పెట్టేశారు.
చాలాకాలం పాటు అన్న ఆదరణ కోసం వేచిచూసిన షర్మిల ఇక లాభం లేదనుకొని. తన నిర్ణయం తాను తీసుకున్నారు. ఏపీలో అన్నకు పోటీగా మారడం ఇష్టంలేక తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ మేరకు వైఎస్సార్ టీపీ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. పార్టీని క్రియాశీలం చేసే క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా పదునైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే కేసీఆర్ తో జగన్ కు ఉన్న మైత్రి కారణంగా సహజంగానే ఆమె విమర్శలు అంతిమంగా తన అన్నకు ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు
ఇక ఇప్పుుడు ఏకంగా ప్రతిరోజూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే మీడియా అధినేతకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో జగన్ బాగా చిరాకుకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అన్నా చెల్లెలి విభేదాలు మున్మందు ఎంతదూరం వెళతాయో తెలియదు కానీ, వీరి వ్యవహారం వల్ల రెండు తెలుగు రాఫ్ట్రాల్లోని వైఎస్ఆర్ అభమానులు మాత్రం బాధపడుతున్నారు.
అయితే.. ఇదంతా వ్యూహమే అనీ, అన్న దూరం పెట్టాడనే సెంటిమెంట్ ప్లే చేసి, తెలంగాణ ప్రజల సింపతీ సంపాదించే రాజకీయం తప్ప, ఇందులో మరేమీ లేదని కొందరు అంటున్నారు. మరి, నిజం ఏంటన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.