Maruti Wagon R: భారతీయ మోటార్ సంస్థ మారుతి. కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త వేరియట్లలో కార్లను విడుదల చేస్తూ.. మార్కెట్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉంది. టాప్ 10 కార్లలో మారుతి సంస్థకు చెందినవే 6 వరకు ఉండడం సంస్థపై కస్టమర్ల నమ్మకానికి నిదర్శనం. 1999లో లాంఛ్ చేసిన మారుతి వ్యాగన్ ఆర్.. ఇప్పుడు సరికొత్త మైలురాయిని అధిగమించింది. 26 ఏళ్లలో ఉత్పత్తిలో 35 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధించిన మూడో మోడల్‌గా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో ఆల్టో, స్విఫ్ట్ ఉన్నాయి. వ్యాగన్ ఆర్ దీర్ఘకాలిక ప్రజాదరణకు ఇది నిదర్శనం. 2025 జూన్ నాటికి 34 లక్షల సేల్స్ దాటింది. మధ్యతరగతి కస్టమర్లకు ఇష్టమైన కారుగా గుర్తింపు పొందింది.
మూడు తరాల చరిత్ర…
తొలి వెర్షన్ హ్యుందాయ్ సాంట్రో పోటీకి 1.0–లీటర్ థ్రీ–సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. టాల్–బాయ్ డిజైన్, ఇంటర్నల్ స్పేస్ ఎక్కువగా ఉండటం, మారుతీ సర్వీస్ నెట్‌వర్క్ దీని విజయానికి కారణం. 2006లో భారత్‌లో మొదటి ఫ్యాక్టరీ–ఫిట్ ఎల్‌పీజీ కిట్‌తో విప్లవం సృష్టించింది. ఇక 2010లో రెండో తరం కొత్త ప్లాట్‌ఫామ్‌పై వచ్చి సీఎన్‌జీ ఆప్షన్ తీసుకొచ్చింది. 2019లో మూడో తరం, 2022లో ఫేస్‌లిఫ్ట్‌తో ఆధునిక లుక్ పొందింది. ప్రస్తుతం 1.2–లీటర్ (90 హార్స్‌పవర్), 1.0–లీటర్ (68 హార్స్‌పవర్) ఇంజన్‌లు 5–స్పీడ్ మాన్యువల్/ఏఎంటీతో అందుబాటులో ఉన్నాయి. ధర రూ.4.98 లక్షల నుంచి రూ.6.95 లక్షల వరకు ఉంది.
ఆల్టో, స్విఫ్ట్‌తో పోటీ..
మారుతి స్విఫ్ట్ (2005లో లాంచ్) 6 సంవత్సరాల తేడాతో 35 లక్షలు త్వరగా సాధించింది. ఆల్టో (2000లో లాంచ్) తక్కువ ధరతో మొదటి స్థానం పొందింది. వ్యాగన్ ఆర్ ఫ్యామిలీలకు ఇష్టమైనప్పటికీ స్పెషల్ ఆఫర్లు, మైలేజ్ వల్ల మెల్లగా మైలురాయి చేరింది. టాల్ డిజైన్‌తో వెనుక సీటింగ్ సౌకర్యం, సీఎన్‌జీ/ఎల్‌పీజీ ఆప్షన్లు గ్రామీణ–పట్టణ కస్టమర్లను ఆకర్షించాయి. ఏబీఎస్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు భద్రతను పెంచాయి. మారుతీ డీలర్ నెట్‌వర్క్ రీసేల్ వాల్యూ, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం దీర్ఘకాలిక విజయానికి మూలం.
ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రచారాలు, కొత్త ఫీచర్లతో వ్యాగన్ ఆర్ మార్కెట్‌లో కొనసాగుతుంది. ఎస్‌యూవీ ట్రెండ్‌లో కూడా ఈ మోడల్ మధ్యతరగతి ఎంపికగా నిలుస్తుంది.