Welfare Schemes : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక మార్పులు జరుగుతున్నాయి. ముందుగా ప్రభుత్వ పథకాల పేర్లు మార్చారు. ఇప్పుడు ఏకంగా వివిధ కట్టడాలకు పెట్టిన పేర్లు సైతం తొలగిస్తున్నారు. ప్రభుత్వ పత్రాలు, ప్రభుత్వ భవనాలు వంటి వాటిపై పార్టీ గుర్తులు, రంగులు, ఫోటోలు మాయం చేస్తున్నారు. సర్వే రాళ్లతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ పేరు, ఫోటోను తొలగించి రాజముద్ర వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలకు జగన్ తో పాటు ఆయన తండ్రి వైయస్సార్ పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వాటిని తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు సైతం ఆదేశించింది. జగనన్న విదేశీ విద్యా దీవెన, వైయస్సార్ కళ్యాణమస్తు, జగనన్న సివిల్ సర్వీసెస్ ముందు పేర్లు తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. 2019కి ముందు ఏపీ ప్రభుత్వంలో ఉన్న పేర్లు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీ అధికార వెబ్సైట్లో పార్టీ జెండా రంగులను తొలగించింది. పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న సర్టిఫికెట్ల పై పార్టీ జండాలకు సంబంధించిన రంగులు ఉంటే వెంటనే నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి అదే పేరు ఖరారు చేసింది. గతంలో వైసిపి హయాంలో వైయస్సార్ యూనివర్సిటీ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కట్టడాలకు జగన్ పేర్లు ఉంటే వెంటనే తొలగిస్తున్నారు.
* వైసిపి హయాంలో ఏర్పాటు
అయితే తాజాగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి శిలాఫలకం పై ఉన్న పేరును తొలగించారు. వైసిపి హయాంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు. అక్కడే ఈ భారీ విగ్రహాన్ని ఉంచారు. అప్పటి సీఎం జగన్ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. అయితే జగన్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ఇటీవల కొందరు తొలగించారు. అది టిడిపి శ్రేణుల పని అని వైసిపి అభిమానులు అనుమానిస్తున్నారు.
*ప్రారంభం కాని పథకాలు
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు కీలక ఫైళ్ళపై సంతకాలు చేశారు. అందులో పింఛన్ల పెంపును ఒక్కటే అమలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు సమీపిస్తోంది. జగన్ హయాంలో జరిగిన విధ్వంశాలపై చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. జగన్ భారీగా అప్పులు చేశారని చెప్పుకొస్తున్నారు.కానీ సంక్షేమ పథకాల జోలికి పోవడం లేదు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. ఆ పథకాలు అమలు చేయకుండా.. జగన్ పేర్లు తొలగింపు ఏంటని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపైనే రచ్చ నడుస్తోంది. రెండు పార్టీల మధ్య పెద్ద వార్ కొనసాగుతోంది.
*+ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయం
సంక్షేమ పథకాల అమలులో జాప్యం పై ఇప్పటికే ఒక రకమైన చర్చ నడుస్తోంది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కీలక కట్టడాలకు, నిర్మాణాలకు ఉన్న జగన్, రాజశేఖర్ రెడ్డి పేర్లు తొలగిస్తుండడంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నాయి.సంక్షేమ పథకాలు అమలు చేయకుండా.. ముందు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చెరిపేసే విధంగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసిపి సిద్ధమవుతోంది. అయితే తాజాగా విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలో విగ్రహ శిలాఫలకంపై పేర్లు తొలగింపు పై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి
https://www.facebook.com/share/WxvMNiP1t6EcY5Lj/?mibextid=xfxF2i
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More