AP Politics: ఏపీలో వర్కవుట్ అయ్యే హామీలు ఇస్తే బెటరేమో?

విశాఖపట్టణానికి గుండెకాయ లాంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా కాపాడతామని చెప్పిన నారా లోకేష్, తమ ప్రభుత్వం ఏర్పడితే కొనుగోలు చేస్తామని ప్రకటించారు.

Written By: Dharma, Updated On : February 13, 2024 7:02 pm

AP Politics

Follow us on

AP Politics: ఎన్నికలన్నాక నాయకులు హామీలు ఇవ్వడం సర్వసాధారణం. అధికారాన్ని దక్కించుకోవడం కోసం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడతామని చెప్పడం కూడా సర్వసాధారణమే.. కానీ ఈ హామీలు అలవికానివైతే మొదటికే మోసం వస్తుంది. ఎలాగూ రాజకీయ నాయకులు హామీలు అమలు చేయడానికి సొంత జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేయరు. ఆస్తులమ్మి ప్రజలకు పథకాల ఫలాలు అందించరు. ప్రభుత్వ భూములు అమ్మో.. అప్పులు చేశో ప్రజలకు పథకాలు అమలు చేస్తారు. కాకపోతే అధికారాన్ని దక్కించుకోవాలని యావ నాయకులకు ఉండటంవల్ల ఇలాంటి హామీలు ఇస్తున్నారో అంతు చిక్కకుండా ఉంది. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రతిపక్ష పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి ఇస్తున్న హామీలకు అంతులేకుండా పోతుంది.

మరి కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారానికి తరలించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని టెక్కలి నుంచి ఆయన ఈ శంఖారావానికి శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరును ఎండ కడుతున్నారు. ఇదే క్రమంలో ప్రజలకు కొన్ని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం సాధారణమైనప్పటికీ.. లోకేష్ ఇస్తున్న హామీలు చూస్తే వీటి అమలు సాధ్యమేనా అనే ఆశ్చర్యం కలుగుతోంది.

విశాఖపట్టణానికి గుండెకాయ లాంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా కాపాడతామని చెప్పిన నారా లోకేష్, తమ ప్రభుత్వం ఏర్పడితే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనేంత డబ్బు ప్రభుత్వాని వద్ద ఉంటుందా? అలా కొనుగోలు చేసి ప్రభుత్వం దానిని ఏం చేస్తుంది? నష్టాలు వస్తున్నాయని చెప్పే కదా కేంద్రం దాన్ని ప్రైవేటుపరం చేస్తోంది? అలాంటప్పుడు ప్రజలను వంచించడానికి తప్పితే.. నారా లోకేష్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ని కొనుగోలు చేస్తామని చెప్పడమేంటి? గతంలో ఇలాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సింగరేణి అధికారులను పంపి వైజాగ్ స్టీల్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తీరా బిడ్లు ఓపెన్ చేసే సమయానికి పత్తాలేకుండా పోయారు. ప్రస్తుతం నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా అలానే కనిపిస్తున్నాయి. ఎన్నికలు అన్నాకా ప్రజలకు హామీలు ఇవ్వడం పరిపాటి. కానీ అవి అలవికాకుండా ఉంటేనే మంచిది. అలా కాకుండా అరచేతిలో స్వర్గం చూపించడం భావి తెలుగుదేశం పార్టీ నాయకుల లక్షణం అనిపించుకోదు.. ఇలాంటి హామీలు కాకుండా అమలు చేసేవి చెబితేనే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఇప్పటికైనా నారా లోకేష్ వాస్తవంలోకి వచ్చి హామీలు ఇస్తేనే బాగుంటుంది.