BJP: ఏపీలో బిజెపి కొత్త గేమ్ ఆడుతుందా? ఇటు టిడిపి, అటు వైసీపీని తన ఆధీనంలో ఉంచుకుంటుందా? ఒకరితో పొత్తు, మరొకరితో స్నేహం కొనసాగించాలని భావిస్తోందా? తన మార్కు రాజకీయం చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. జగన్ తో స్నేహం కోరుకొంటూనే… చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోవడం వెనుక వ్యూహం ఉన్నట్లు తేలుతోంది. ఇటువంటి రాజకీయం బిజెపికి మాత్రమే సాధ్యమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
2014లో టిడిపి,బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన బయట నుంచి మద్దతు తెలిపింది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చింది. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన ఎవరికి వారుగా పోటీ చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బిజెపి అగ్రనేతలకు దగ్గరయ్యారు. గత ఐదేళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఎన్డీఏ లో చేరకుండానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడు టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో జగన్ తో స్నేహం కొనసాగించి ద్విముఖ వ్యూహాన్ని బిజెపి అమలు చేస్తోంది. తొలుత చంద్రబాబును బిజెపి అగ్ర నేతలు ఆహ్వానించారు. పొత్తులకు సంబంధించి కీలక చర్చలు జరిపారు. తరువాత జగన్ నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. తద్వారా టిడిపి, వైసీపీని సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు అయింది. ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకున్నా.. తమ పట్టు నుంచి జారుకోకుండా ముందస్తు చర్యలు ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలో పడుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో వైసిపికి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. తాజా ఎన్నికలతో ఆ సంఖ్య 11 కు జరగనుంది. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేదు. అందుకే భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం వైసీపీతో స్నేహం కొనసాగించాలని బిజెపి చూస్తోంది. అదే సమయంలో టిడిపి, జనసేన కూటమితో లోక్ సభ స్థానాల సంఖ్య పెంచుకోవాలని భావిస్తోంది. ఇలా ఒకే సమయంలో రెండు పార్టీలతో అనుబంధాన్ని కొనసాగించి ఏపీలో బలపడాలని.. పెద్దల సభలో వైసీపీ మద్దతు తీసుకోవాలని బిజెపి ఆలోచనగా తెలుస్తోంది. మరి బిజెపి వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.