Bandla Ganesh Padayatra: చంద్రబాబు( AP CM Chandrababu) కోసం పాదయాత్ర చేస్తున్నారు నిర్మాత బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టిడిపి అధినేత కోసం పాదయాత్ర చేయడంపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అయితే తనను రాజకీయ కోణంలో చూడవద్దని.. వివాదాలు చేయవద్దని బండ్ల గణేష్ ఇప్పటికే కోరారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వేరే లెవెల్ లో ప్రచారం నడుస్తోంది. ఏదో ఆశించి బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఎప్పుడో 2023లో అరెస్టు అయ్యారు. 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు బండ్ల గణేష్ మొక్కు తీర్చుకోవడం ఏమిటి అనేది ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అందుకే సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ లో తగ్గిన ప్రాధాన్యం..
2018లో తెలంగాణలో ( Telangana) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు బండ్ల గణేష్. ఒకరోజు ముందుగా వెళ్లి ఎల్బీ స్టేడియంలో కూడా కూర్చున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. అప్పటినుంచి బండ్ల గణేష్ అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా విశ్వాసం తగ్గింది. అయితే 2023 తెలంగాణ ఎన్నికల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని చూశారు గణేష్. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బండ్ల గణేష్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అందుకే చంద్రబాబు కోసం ఇలా పాదయాత్ర చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వ్యాపారాల కోసమేనా?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు. బండ్ల గణేష్ కు సినీ నిర్మాణం తో పాటు చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి . రేవంత్ పెద్దగా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు కోసం ఈ పాదయాత్ర చేశారని ఎక్కువమంది ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పదవితో పాటు తన వ్యాపారాలను కాపాడుకునేందుకే అన్నవారు ఉన్నారు. అయితే తన పాదయాత్ర విషయంలో ఎటువంటి విమర్శలు చేయవద్దని.. రాజకీయ కోణంలో చూడవద్దని ఇదివరకే బండ్ల గణేష్ కోరిన సంగతి తెలిసిందే. అందుకే బండ్ల గణేష్ పాదయాత్రను ఎవరు పెద్దగా విమర్శించడం లేదు. షాద్ నగర్ లో తన నివాసం నుంచి తన పాదయాత్ర మొదలుపెట్టారు బండ్ల గణేష్. 450 కిలోమీటర్ల మేర ప్రయాణించి స్వామివారిని దర్శించుకొనున్నారు..