Jagan: వైసిపి అధినేత జగన్ ( Jagan) పై పార్టీ శ్రేణులు ఒక రకమైన అసంతృప్తితో ఉన్నాయి. గత ఐదేళ్లుగా పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడం ఒక కారణం అయితే.. తమకంటే రెండు వ్యవస్థలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో ఇది సీనియర్లకు సైతం మింగుడు పడని విషయం. తొలుత వాలంటీర్లను (volunteers) బలంగా నమ్మారు. గ్రామాల్లో పార్టీ క్యాడర్ను పట్టించుకోలేదు. ఆ ప్రభావం స్పష్టంగా ఎన్నికల్లో కనిపించింది. తీరా ఎన్నికల సమయానికి వాలంటీర్లు చేతులెత్తేశారు. ఆ వ్యవస్థ పై ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ పెడచెవిన పెట్టారు జగన్. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు ఈ ఎన్నికల్లో. వాలంటీర్ వ్యవస్థను( volunteer system) నమ్ముకొని పార్టీ క్యాడర్ను విడిచిపెట్టడంతో.. ఎన్నికల్లో నిండా మునిగిపోయారు. మరొకటి ఐ ప్యాక్ టీం. పార్టీ వ్యూహకర్తల బృందాన్ని బలంగా నమ్మారు. వారితోనే పార్టీని నడిపించారు. వారు సైతం సక్రమంగా పనిచేయలేదు అన్న విమర్శ ఉంది. ఈ రెండు వ్యవస్థల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన జగన్.. మరోసారి వారినే ప్రోత్సహించడం విశేషం.
* జిల్లాల పర్యటనకు సిద్ధం
ఈ నెల చివరి నుంచి జిల్లాల పర్యటనకు ( district Tours) జగన్ సిద్ధపడుతున్నారు. ఇంతలో విదేశీ పర్యటన ముగించుకుని రానున్నారు. అయితే మరోసారి ఐప్యాక్ టీం రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎన్నికల అనంతరం ఐప్యాక్ టీం బ్యాక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ ప్రజల్లోకి వెళ్తుండడం.. వచ్చే నాలుగేళ్ల కాలం ఐప్యాక్ సేవలను వినియోగించుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఐప్యాక్ వ్యూహాలు పనిచేశాయి. జగన్ అధికారంలోకి రాగలిగారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఐ ప్యాక్ టీం వైసీపీని( YSR Congress ) గట్టెక్కించలేకపోయింది. ఇప్పుడు అదే ఐప్యాక్ టీమ్ ను మరోసారి తెచ్చుకోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* తప్పిన వ్యూహాలు
గత ఐదేళ్ల కాలంలో ఐప్యాక్ టీం అంచనాలు తప్పాయి. వ్యూహాలు సైతం పనిచేయలేదు. ముఖ్యంగా 2023 మార్చి నుంచి ఐ ప్యాక్ వైఫల్యాలు బయటపడ్డాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ( graduate MLC elections) ఐప్యాక్ అతి నమ్మకం వైసీపీకి తీవ్ర నష్టం కలిగించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ దే గెలుపు అని ఐప్యాక్ అధినేత జగన్ ను నమ్మించింది. కానీ అంచనాలు ఫలించలేదు. టిడిపి విజయం సాధించింది. అప్పటినుంచి వైసీపీ పరిస్థితి తారుమారయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు ఐప్యాక్ టీం పై ( ipak team) తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. దానికి కారణాలు లేకపోలేదు. వారిని నిరంతరం వాచ్ చేసే ప్రతినిధులు తప్పుడు నివేదికలు అందించే వారన్నది అప్పట్లో ఉండే విమర్శ. చాలాచోట్ల ఐ ప్యాక్ ప్రతినిధులు ప్రత్యర్థులకు సహకరించాలన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే ఐప్యాక్ టీమును జగన్ రప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.