Investment Summit In Visakhapatnam: విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు ప్రారంభం అయింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ వేదికగా ఈ సదస్సు రెండు రోజులపాటు కొనసాగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం ఈ సదస్సుకు సన్నాహాలు ప్రారంభించింది. సీఎంతో పాటు మంత్రులు స్వయంగా వెళ్లి ఆహ్వానాలు అందించారు. దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం లేదా? అనే వార్త హల్చల్ చేస్తోంది. పౌర సంబంధాల శాఖ విడుదల చేసిన అతిధుల జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అసలు పవన్ వస్తారా? రారా? అనేది స్పష్టత లేకుండా పోయింది. గత కొద్ది రోజులుగా అటవీ శాఖ భూముల పరిశీలనతో పాటు ఎర్రచందనం నిల్వలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఏకంగా వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన భూముల వీడియోలను తీసి మంత్రివర్గ సహచరులకు చూపించారు. గత రెండు రోజులుగా రాజకీయంగా సైతం హాట్ టాపిక్ అవుతున్నారు.
* ఒక్కొక్కరిది ఒక్కో బాధ్యత..
అయితే కూటమి ప్రభుత్వం( Alliance government) విధానాలు చూస్తుంటే ఒక అంశం స్పష్టంగా కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా డ్యామేజ్ జరిగినప్పుడు బయటకు వస్తున్నారు. అటు లోకేష్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తన శాఖ ప్రగతి, ఏపీకి పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలను చూస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు ఇలా కీలక బాధ్యతల్లో సర్దుబాటు అయ్యారు. పవన్ కళ్యాణ్ కదలికలు చూస్తే ఆయన గ్రామీణ ప్రాంత అభివృద్ధి, పర్యటనలు చేస్తున్నారు. అయితే విదేశాల నుంచి పరిశ్రమలతో పాటు పెట్టుబడులు తెచ్చే బాధ్యతను లోకేష్ తీసుకున్నారు. అయితే ఈ విషయంలో చక్కటి సమన్వయం కనిపిస్తోంది. విభిన్న ప్రకటనలు, నిర్ణయాలు ప్రకటించక పోవడాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఇది అనుకునే చేస్తున్నదే.
* ప్రకటనల్లో ప్రాధాన్యం..
విశాఖ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ప్రభుత్వం పౌర సంబంధాల శాఖ ద్వారా భారీగా ప్రకటనలు ఇచ్చింది. అయితే ఈ యాడ్లలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియాష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఈ ప్రకటన ఇస్తున్నట్టు అందులో ఉంది. మరి ప్రకటనల్లోనే పవన్ కళ్యాణ్ కు అంత ప్రాధాన్యం ఉంటే.. కచ్చితంగా ఆయన సదస్సుకు హాజరవుతారని అంతా భావించారు. కానీ అతిధుల జాబితాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నాదేండ్ల మనోహర్, టీజీ భరత్ తో పాటు సిఐఐ కోఆర్డినేటర్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం లేదా అనే చర్చ నడుస్తోంది. వైసీపీ అనుకూల మీడియా అయితే దీనిని హైలెట్ చేస్తోంది. క్రమేపి పవన్ కళ్యాణ్ ని సైడ్ చేస్తున్నట్లు చెప్పుకొస్తోంది.
* రెండో రోజు హాజరు..
రెండు రోజులపాటు ఈ సదస్సు కొనసాగే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) తో పాటు కేంద్రమంత్రి గోయల్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఈరోజు రాత్రి 8 గంటల వరకు ఈ సదస్సు కొనసాగనుంది. రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు ముగింపు ఉత్సవం నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం తొలిరోజు అతిధుల జాబితాను విడుదల చేశారు. కచ్చితంగా రేపటి జాబితాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరుపున ఎటువంటి కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్ హాజరయ్యే వారు. తప్పకుండా రేపు హాజరవుతారని జనసైనికులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.