Nara Lokesh plan: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ పై ఫుల్ ఫోకస్ పెట్టారు నారా లోకేష్. ప్రస్తుతం ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ఉన్నారు. కానీ మంత్రి లోకేష్ మాత్రం అనధికారికంగా పార్టీని నడుపుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉండి.. పోరాటం చేసిన వారికి మాత్రమే నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశారు. పదవుల నియామకం సమయంలో వారు పార్టీకి చేసిన సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటువంటి వారికి మాత్రమే పదవులు కట్టబెట్టారు. అయితే ఇప్పుడు సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు నారా లోకేష్. మండల, పంచాయితీ, క్లస్టర్, బూత్ స్థాయిలో టిడిపి కమిటీలను నియమించారు. ఆ కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సైతం.. పదవుల స్వీకరణ మాదిరిగా నిర్వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీలు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నట్టే. ప్రాంతీయ పార్టీలకు అది అవసరం కూడా. ఇప్పటికే బీమా సదుపాయం కల్పించి రికార్డు సృష్టించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ బీమా వర్తింపజేసేలా చేశారు.
బలమైన ప్రాంతీయ పార్టీగా..
దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ అవి కొద్ది రోజులకే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. అటువంటి ఇబ్బందులే తెలుగుదేశం పార్టీకి ఎదురయ్యాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగింది తెలుగుదేశం పార్టీ. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు బలహీనం అయ్యాయి. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎన్టీఆర్ బలమైన పునాదులు వేస్తే.. దానికి మరింత బలం జోడించారు చంద్రబాబు. ఇప్పుడు లోకేష్ తరంలో సైతం పార్టీ నిర్మాణాన్ని మరింత బలంగా చేపట్టాలని ఈ క్లస్టర్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పార్టీ అంటే అభిమానం ఉండే ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేశారు.
పార్టీ కోసం విలువైన సమయం..
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి పాలన చేస్తోంది. గత అనుభవాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీకి విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు చంద్రబాబు, లోకేష్. అధికార కార్యక్రమాల కోసం ఏ జిల్లాకు వెళ్తున్న.. తగిన సమయాన్ని పార్టీ కోసం కేటాయిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే క్లస్టర్ ఇన్చార్జిల ఆలోచన లోకేష్ కు వచ్చింది. పార్టీ విధానాలతో పాటు ప్రభుత్వ అంశాలను ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లేందుకు ఈ క్లస్టర్ ఎంతగానో దోహదపడుతోంది. అందుకే నామినేటెడ్ పదవుల మాదిరిగా ఈ క్లస్టర్ ఇన్చార్జిల నియామకాన్ని కూడా చేపడుతున్నారు. ఒక్క విధంగా చెప్పాలంటే వాలంటీర్ల వ్యవస్థకు ధీటుగా ఈ క్లస్టర్ వ్యవస్థ ఎంతో ప్రయోజనకారిగా మిగలనుంది.