International Cricket Matches In Visakhapatnam: క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లకు విశాఖ( Visakhapatnam) వేదిక కానుంది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ వన్డే క్రికెట్ టోర్నీ మ్యాచ్ లు విశాఖలో జరగనున్నాయి. ఏసీఏ- వీడిసిఎ స్టేడియంలో ఈనెల 9 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. దీంతో విశాఖ జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ హరేందిర ప్రసాద్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సమీక్షించారు. ఆటగాళ్ల భద్రత, ప్రేక్షకులకు సౌకర్యాలు వంటి వాటిపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించారు. టోర్నీని విజయవంతంగా పూర్తి చేసేలా అందరూ సహకరించాలని కోరారు.
* మొత్తం ఐదు మ్యాచ్ లు..
ఉమెన్స్ ప్రపంచ కప్ టోర్నీలో( women’s World Cup tourney) భాగంగా ఈనెల 9, 12, 13, 16, 26 తేదీల్లో మొత్తం ఐదు మ్యాచ్లు జరగనున్నాయి. 9న భారత్- సౌత్ ఆఫ్రికా, 12న భారత్- ఆస్ట్రేలియా, 13న బంగ్లాదేశ్ -సౌత్ ఆఫ్రికా, 16న ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్, 26న ఇంగ్లాండ్- న్యూజిలాండ్ల మధ్య మ్యాచులు జరగనున్నాయి. ఈ ఐదు మ్యాచ్లలో భారత్ రెండు సార్లు ఈ గ్రౌండ్లో ఆడనుంది అన్నమాట. అయితే ప్రేక్షకుల సౌకర్యార్థం తక్కువ ధరకే టికెట్లు నిర్ణయించారు. భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ కు క్రేజ్ ఉండడంతో టికెట్ ధర రూ.150 గా నిర్ణయించారు. మిగిలిన మ్యాచ్లకు మాత్రం టికెట్ ధర 100 రూపాయలు మాత్రమే. అయితే సాధారణ క్రికెట్ మ్యాచ్ లకు వెయ్యి రూపాయల వరకు టికెట్ ధర ఉండగా.. మహిళా క్రికెట్ టోర్నీ టికెట్ ధరను మాత్రం 100 రూపాయలుగా నిర్ణయించడం విశేషం.
* ఆన్లైన్,ఆఫ్ లైన్ లో టిక్కెట్లు
విశాఖలో అంతర్జాతీయ టోర్నీ వేదిక కావడంతో యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్ వీక్షించేందుకు మైదానానికి వచ్చే ప్రేక్షకుల కోసం మంచినీరు, వైద్య సదుపాయాలు అందించాలని నిర్ణయించింది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టనున్నారు పోలీసులు. మరోవైపు ఈ మ్యాచ్ లకు టికెట్లు బుక్ మై షో వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. స్టేడియం దగ్గర కూడా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. గేట్ నెంబర్ 17 దగ్గర ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఒక అంతర్జాతీయ క్రికెట్ టోర్నీకి విశాఖ వేదిక కానుండడం.. సాగర నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.