Homeఆంధ్రప్రదేశ్‌Garividilaxmi Burrakatha: 90 లోనే 'నల్ల జీలకర్ర మొగ్గ'.. జానపదాలకే వన్నెతెచ్చిన 'గరివిడి లక్ష్మి'!

Garividilaxmi Burrakatha: 90 లోనే ‘నల్ల జీలకర్ర మొగ్గ’.. జానపదాలకే వన్నెతెచ్చిన ‘గరివిడి లక్ష్మి’!

Garividilaxmi Burrakatha: ‘నల్ల జీలకర్ర మొగ్గ.. నా నల్ల జీలకర్ర మొగ్గ.. రూపాయి కావాలా.. రూపాయి పువ్వులు కావాలా’.. ఇటీవల ఈ సాంగ్ సోషల్ మీడియాలో( social media) ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఇదేదో కొత్త పాట కాదు. పాతపాటే. జానపదాల్లో భాగంగా జాలువారిన పాట ఇది. గరివిడి లక్ష్మి అనే బుర్రకథ కళాకారిణి నోటి నుంచి వచ్చిన పాట ఇది. అప్పట్లోనే ఒక ఊపు ఊపేసింది. అసలు ‘గరివిడి లక్ష్మి’ అనే బుర్రకథ ఉత్తరాంధ్రలో ప్రభంజనం సృష్టించింది. యావత్ ఏపీని ఊపేసింది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. తెలుగువారు ఉన్న ప్రతి చోటకు ‘గరివిడి లక్ష్మి’ అనే బుర్రకథ వెళ్లిందంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 90వ దశకంలోనే జానపదాలకు సరికొత్త ఊపిరి పోసింది గరివిడి లక్ష్మి బుర్రకథ. అటువంటి గరివిడి లక్ష్మి కళాకారిణి బయోగ్రఫీతో రూపుదిద్దుకుంటుంది ‘గరివిడి లక్ష్మి’ సినిమా.

Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!

* విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లా( Vijayanagaram district) గరివిడి కి చెందిన ఓ సాధారణ యువతి లక్ష్మి. జానపదాలు అన్నా.. బుర్ర కథలో వచనం అన్నా.. ఆమెకు విపరీతమైన ఆసక్తి. అలా బుర్రకథ వైపు అడుగులు వేశారు లక్ష్మి. సమాజంలో కళలు ప్రదర్శించాలన్నా.. స్టేజీ పై వేషాలు వేయాలన్నా ఎన్నో రకాల అవమానాలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు లక్ష్మి. నర్సింగరావు హాస్యంతో.. లక్ష్మీ వచనంతో.. ఆమె పర్యవేక్షణలోనే ఈ బుర్రకథ దళం ప్రారంభం అయింది. అలా గరివిడి లక్ష్మి బుర్రకథ దళంగా మారింది.

* విపరీతమైన క్రేజ్..
ఉత్తరాంధ్రలో( North Andhra) బుర్రకథ అనేది ఒక జానపద కళ. విపరీతమైన క్రేజ్ ఉండేది బుర్రకథలకు. రామాయణం, భారతం, శివ బాగోతం ఇలా రకరకాల ఇతివృత్తానికి.. తమదైన హాస్యాన్ని జోడించి చెప్పేదే బుర్రకథ. ఒకవైపు ఇతివృత్తం తప్పినా.. దానికి హాస్యం తగినంత మోతాదులో లేకున్నా.. ఆ బుర్ర కథ ప్రదర్శన ఫెయిల్ కావడం ఖాయం. అటువంటి సమయంలోనే హాస్య సంభాషణలతో, తనదైన హస్కీ వాయిస్ తో.. ప్రేక్షకులను మెప్పించారు గరివిడి లక్ష్మి. జానపదాలను తనదైన సొంత శైలితో పాడి వన్నెతెచ్చారు. అలా వచ్చిన పాటే నల్ల జీలకర్ర మొగ్గ.. నా నల్లజీలకర్ర మొగ్గ. ప్రస్తుతం ఈ పాటనే గరివిడి లక్ష్మి సినిమాలో వాడుతున్నారు.

* పదివేల ప్రదర్శనలతో..
90వ దశకంలో పదివేల ప్రదర్శనలతో రికార్డు సృష్టించింది గరివిడి లక్ష్మి( Garividi Lakshmi ) బుర్రకథ దళం. దానికి ముమ్మాటికి కారణం మాత్రం విశాఖలోని శ్రీమాతా రికార్డింగ్ కంపెనీ. 1996లో అప్పుడే శ్రీమాతా రికార్డింగ్ కంపెనీని ప్రారంభించారు భిన్నాల నరసింహమూర్తి, పల్లి నాగభూషణం అనే ఇద్దరు యువకులు. జానపదాలకు సరికొత్త రూపం తేవాలని భావించారు. అలా 1996 సెప్టెంబర్ లో గరివిడి లక్ష్మి బుర్రకథను ఆడియో రూపంలో తీసుకొచ్చారు. దానికి నవ్వుల బండి అనే జానపద పాటల క్యాసెట్ను జోడించారు. పాటల రచయిత రాయంచతో జానపదాలకు ఒక తుది రూపం తీసుకొచ్చి రికార్డింగ్ చేశారు. దీంతో గరివిడి లక్ష్మి బుర్రకథ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మరింత సుపరిచితం అయింది. అదే సమయంలో మాతా రికార్డింగ్ కంపెనీ పేరు మారుమోగిపోయింది. విపరీతంగా క్యాసెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్త కళాకారిణిగా మారిపోయారు గరివిడి లక్ష్మి. సాధారణంగా ఒక కళాకారుడు ఏడాదిలో 100 ప్రదర్శనలు ఇస్తే గొప్ప. అటువంటిది గరివిడి లక్ష్మి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడాదిలో 365 ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ప్రదర్శనలు ఇచ్చిన ఘనత గరివిడి లక్ష్మిది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా.. మారుతున్న మాధ్యమాలకు తగ్గట్టు బుర్రకథలకు ఆదరణ తగ్గింది. కానీ ఇప్పటికీ ఇంటర్నెట్లో గరివిడి లక్ష్మి బుర్రకథ కోసం అన్వేషించే జానపద ప్రేమికులు ఉన్నారు. అయితే అంతటి గుర్తింపు దక్కించుకున్న గరివిడి లక్ష్మి జీవిత ఇతివృత్తంతో తాజాగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. నిజంగా ఆమెతోపాటు విజయనగరం జిల్లా గరివిడి ప్రాంత ప్రజలు ఇప్పుడు ఎంతగానో ఆనందిస్తున్నారు. తమ ఊరి పేరుతో సినిమా వస్తుండడాన్ని స్వాగతిస్తున్నారు.

* ఆమె పేరుతో సినిమా..
గరివిడి లక్ష్మి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘గరివిడి లక్ష్మి’. టైటిల్ పాత్రలో ఆనంది నటిస్తోంది. నరేష్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరీ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథ కళాకారుని అయిన గరివిడి లక్ష్మి సంగీత వారసత్వానికి ఈ సినిమా ఒక ప్రతీకగా ఉంటుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఆనంది రోల్ కు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసింది. నల్ల జీలకర్ర మొగ్గ పాట విడుదల చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version