Pawan Kalyan: సాధారణంగా వైసిపి, జనసేన మధ్య ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుంది. మాటల దాడి కూడా కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా నిత్యం రచ్చ నడుస్తుంది. అసెంబ్లీలో అయితే మరి చెప్పనవసరం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్నట్టు పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సమయంలో రెండు పార్టీల కీలక నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎందుకు అసెంబ్లీ ప్రాంగణం వేదికగా మారింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. సాధారణంగా ఈ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వైసీపీకి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ఆ పార్టీకి పిఎసి చైర్మన్ పదవి ఇచ్చేందుకు కూటమి సుముఖంగా లేకపోయింది. దీంతో వైసీపీ తరఫున సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ప్రాంగణం కోలాహలంగా మారింది. సరిగ్గా మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అప్పుడే వైసిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ఆ సమయంలోనే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కు ఎదురుపడ్డారు. దీంతో ఆ ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. బొత్సకు పవన్ కళ్యాణ్ నమస్కరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
* దూరంగా ఉండిపోయిన వైసీపీ నేతలు
అయితే వైసిపి బృందంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. అందరూ కలిసి వస్తుండగా పవన్ బయటకు రావడాన్ని చూసిన బొత్స నిలబడిపోయారు. బొత్సను గమనించిన పవన్ నేరుగా ఆయన వద్దకు వచ్చి పలకరించారు. ఆ ఇద్దరు నేతలు పరస్పరం గౌరవించుకొని వెనదిగారు. అయితే అక్కడకు దూరంగా జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఇతర వైసిపి ప్రజాప్రతినిధులు ఆసక్తిగా తిలకించడం కనిపించింది. అయితే బొత్స ఎదురెళ్లి పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* బొత్స పై అనుమానాలు
బొత్స సీనియర్ నేత కావడంతో శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా పదవి ఇచ్చారు జగన్. పార్టీ క్లిష్ట సమయంలో ఉండడంతో ఆదుకుంటారని భావించి విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. మండలికి పంపించారు. మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. కానీ క్యాబినెట్ తో సమానమైన ఆ హోదాను శాసనమండలిలో దక్కించుకున్నారు బొత్స. అయితే జగన్ అంచనాలకు అందుకోలేకపోతున్నారు. మండలిలో కూటమి దూకుడును నిలువరించలేకపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు ఎదురు వెళ్లి గౌరవించడం పై వైసీపీలో విస్మయం వ్యక్తం అవుతోంది. మరి ఇది ఎంత దాకా తీసుకెళ్తుందో చూడాలి.