TDP candidate: ఏపీలో ఈ ఎన్నికల్లో ఆర్థికంగా బలమైన నేతలు పోటీ చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ సమర్పిస్తున్న నేపథ్యంలో నేతలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సి వస్తోంది. ఒకరికి మించి ఒకరి ఆస్తులు ఉన్నట్టు వెలుగు చూస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అన్ని పార్టీల్లో ఆర్థిక శ్రీమంతులు ఉండడం విశేషం. అయితే తాజాగా గుంటూరు ఎంపీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే రికార్డు స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్లో ప్రకటించారు. బహుశా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎంతో మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ ఇప్పటివరకు ఈ స్థాయిలో ఆస్తుల విలువను ప్రకటించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చగా మారింది.
పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో స్థిరపడిన ఏపీ వైద్యుడు. గుంటూరు జిల్లాలో పుట్టిన చంద్రశేఖర్ ఎంబీబీఎస్ వరకు ఇండియాలోనే చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తూ అక్కడే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడ్డారు. యు వరల్డ్ పేరుతో అమెరికాలో మెడికల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఆన్లైన్ ఎడ్యుకేట్ కంపెనీ ప్రారంభించారు. దీంతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఆర్థికంగా శ్రీమంతుడు కూడా. అయితే సొంత ప్రాంతానికి ఏదో చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సుదీర్ఘకాలం చంద్రశేఖర్ అమెరికాలో ఉన్నా తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడగలరు. దేశ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు ఎంపీ టికెట్ ను పొందారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్ గెలుపొందారు. ఇటీవలే ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్ ను చంద్రబాబు ఎంపిక చేయడం విశేషం.
తాజాగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫీడవిట్లో పొందుపరిచారు. తనకు 5700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అందులో చరాస్తి విలువ 2316 కోట్లు తన పేరిట ఉన్నట్లు చూపించారు. భార్య శ్రీ రత్న పేరిట మరో 2289 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తనతో పాటు తన భార్యకు సమానంగా అప్పులు కూడా ఉన్నాయని చూపించారు. తనకు 519 కోట్లు అప్పు ఉంటే.. భార్య పేరుట మరో 519 కోట్లు అప్పు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జేపీఎం ఇన్వెస్ట్మెంట్స్ లో తన పేరిట 1200 కోట్ల రూపాయల విలువైన షేర్లు ఉన్నాయని.. తన భార్య పేరిట మరో 1200 కోట్ల షేర్లు ఉన్నట్లు తెలిపారు.
తమకు రెండు మెర్సిడైజ్ బెంజ్, టెస్లా, రోల్స్ రాయిస్, టయోటా పార్టూర్ కార్లు ఉన్నట్లు వివరించారు. అక్షరాల 6.11 కోట్లు విలువ చేస్తాయని స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాలో తన పేరిట 5.97 కోట్లు, భార్య పేరిట 5.90 కోట్లు ఉన్నాయని చూపించారు. తన భార్య పిల్లలకు కలిపి 6.86 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయని, గుంటూరు జిల్లాలో 2.67 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, కృష్ణాజిల్లాలో తన భార్య పేరిట 2.33 కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. హైదరాబాదులో 28.10 కోట్ల విలువైన వ్యవసాయే తర భూములు ఉన్నాయని వివరించారు. అమెరికా, హైదరాబాద్, ఢిల్లీలో విలువైన భవనాలు ఉన్నాయని చంద్రశేఖర్ తన అఫీడవిట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు నేతల అఫీడవిట్లలో పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు విలువ అధికమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More