Chandrababu: చంద్రబాబు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.’కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. వైసీపీని గద్దె దించాలంటే జనసేనతో పొత్తు అవసరం. కానీ ఈ పొత్తు పొడవాలంటే సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి టిడిపిది. గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు కావాలని జనసేన నుంచి సంకేతాలు వస్తున్నాయి. టిడిపికి తప్పకుండా దక్కుతాయని భావిస్తున్న రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తే.. పవన్ మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. ఇది చాలదన్నట్టు మూడో వంతు అసెంబ్లీ స్థానాలు కావాలని పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆ స్థాయిలో సీట్లిస్తే సీనియర్ల పరిస్థితి ఏమిటని ఆందోళన టిడిపిలో కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు ఒక రకమైన డిఫెన్స్ లో పడిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు జనసేన కోరుతున్నట్లు మూడో వంతు సీట్లు అప్పగిస్తే.. 55 నుంచి 60 స్థానాలు ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉభయ గోదావరి, విశాఖ, కోస్తాంధ్రలో ఈ సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి చాలామంది సీనియర్లు టిడిపిలోనే కొనసాగుతున్నారు. 2004 నుంచి 2014 వరకు పార్టీ అధికారంలో లేకున్నా.. పార్టీలో కొనసాగుతూ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆ స్థానాలు జనసేనకు కేటాయించాలని కోరుతుండడంతో వారిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
అధికారంలోకి రావాలంటే 90 సీట్లు దక్కించుకోవాలి. ఆ సీట్లు దక్కాలంటే టిడిపి ఒంటరిగా 150 స్థానాలకు పోటీ చేయాలి. అప్పుడే 90 నుంచి 100 సీట్లు సాధించే అవకాశం ఉంది. 50 నుంచి 60 స్థానాలు జనసేనకు అప్పగిస్తే ఆ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుచుకుంటే కీరోల్ ప్లే చేసే అవకాశం ఉంది. టిడిపి 120 స్థానాలకు పరిమితమైతే అందులో గెలిచేవి ఎన్ని? మ్యాజిక్ ఫిగర్ 90 సీట్లు దాటగలదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే జనసేనకు 25కు మించి స్థానాలు ఇస్తే అది టిడిపికి ఇబ్బందికర పరిణామంగా మారుతుందని సీనియర్లు చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఎటూ పాలు పోవడం లేదు. మరోవైపు కూటమిలోకి బిజెపి చేరితే ఆ పార్టీకి కొన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు అంటేనే చంద్రబాబుకు తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. అందుకే ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే వరకు అభ్యర్థుల ప్రకటనను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది.
పొత్తులను గౌరవిస్తూనే పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని ప్రస్తావించడం ద్వారా పవన్ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముమ్మాటికీ పొత్తు ఉంటుందని చెబుతూనే… వీలైనంతవరకు ఎక్కువ సీట్లు రాబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది టిడిపి సీనియర్లలో అసహనానికి కారణమవుతోంది. గత ఐదు సంవత్సరాలుగా వ్యయప్రయాసలకోర్చి పార్టీని నిలబెడితే.. ఇప్పుడు జనసేన తమ సీటును తన్నుకు పోవడంపై వారిలో ఆవేదన కనిపిస్తోంది. అందుకే ఎక్కువ మంది సీనియర్లు చంద్రబాబును ఆశ్రయిస్తున్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో.. తమ నియోజకవర్గాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో చంద్రబాబులో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పొత్తుల విషయంలో పవన్ ఎలా కన్వెన్స్ చేయాలో పాలు పోవడం లేదు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పవన్ తో కూర్చుని డిసైడ్ చేసుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.