Uttar Pradesh: గుప్త నిధులు.. ఈ పదం తరచూ వింటుంటాం. ఈ నిధుల కోసం పురాత కట్టడాలు, చారిత్రక స్థలాల్లో దుండగులు తవ్వకాలు జరుపుతూనే ఉంటారు. క్షుద్రపూజలు, బలిదానాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ, ఇక్కడ ఓ కాంట్రాక్టర్ అలాంటివి ఏమీ చేయకుండానే గుప్తనిధి ఆయనను వరించింది. పట్టి తవ్వకాలు జరుపుతుండగా లభించిన ఓ కుండను ఓపెన్ చేయగా, అందులో బంగారు, వెండి నాణేలు కనిపించాయి. ఇంకేముంది సదరు కాంట్రాక్టర్ పనులు అక్కడే వదిలి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘటన..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా జున్‌వై ప్రాంతంలోని హరగోవింద్‌పూర్ గ్రామంలో గ్రామపెద్ద కమలేశ్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డుకు కావాల్సిన మట్టిని లాహ్రా నాగ్లా శ్యామ్ ప్రాంకకి చెందిన మణిరామ్‌సింగ్ పొలం నుంచి తెప్పిస్తున్నారు. మట్టి తవ్వుతుండగా అకస్మాత్తుగా కార్మికులకు ఓ మట్టి కుండ కనిపించింది. వెంటనే దానిని తెరిచి చూడగా కళ్లు చెదిరే బంగా, వెండి నాణేలు ఉన్నాయి. ఈ విషయాన్ని కాంట్రాక్టర్‌కు తెలిపారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న కాంట్రాక్టర్ పరిస్థితిని అంచనా వేశాడు. కూలీలకు కొన్ని నాణేలు ఇచ్చాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని ఆ నిధితో అక్కడి నుంచి పారిపోయాడు.
విషయం లీక్ కావడంతో..
అయితే విషయం లీక్ అయింది. నిధి దొరికింది అన్న వార్త ఆ ప్రాంతంలో వ్యాపించింది. దీంతో గ్రామస్తులంతా పెద్దసంఖ్యలో మణిరామ్‌సింగ్ పొలం వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామ పెద్ద కమలేశ్ కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేసుకుని కాంట్రాక్టర్ కోసం వేట సాగిస్తున్నారు.
మొఘలుల కాలం నాటివిగా..
ఇదిలా ఉండగా స్థానికులకు కాంట్రాక్టర్ ఇచ్చిన నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించి 18వ శతాబ్దపు మొఘలు శకం నాటివి అని భావిస్తున్నారు. కాంట్రాక్టర్‌కు దొరికిన నాణేలు కిలోకుపైగానే ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు మణిరామ్‌సింగ్ పొలంలో మరెవరూ తవ్వకాలు జరుపకుండా భద్రత ఏర్పాటు చేశారు. మైనింగ్, భూగర్భశాఖ అధికారులకు సమాచారం అందించారు.