Homeఆంధ్రప్రదేశ్‌AP Constituencies Increase: ఏపీలో నియోజకవర్గాల పెంపు.. అసలు ప్లాన్ ఏంటి?

AP Constituencies Increase: ఏపీలో నియోజకవర్గాల పెంపు.. అసలు ప్లాన్ ఏంటి?

AP Constituencies Increase: రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. కూటమి( Alliance ) దూకుడు మీద ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో భారీ ఎత్తున అవినీతి, కుంభకోణాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇంకోవైపు అవన్నీ రాజకీయ కక్షపూరిత కేసులని వైసీపీ చెప్పుకొస్తోంది. అయితే లోలోపల మాత్రం ఎవరికీ వారే పట్టుబిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ బలంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. దీంతో ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎత్తుకు పైఎత్తులు కొనసాగుతున్నాయి.

Also Read: రాహుల్ గాంధీ అరెస్ట్.. ఢిల్లీలో ఏం జరుగుతోంది..

 225 అసెంబ్లీ నియోజకవర్గాలు..
అయితే వచ్చే ఎన్నికల నాటికి ఏపీవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పెంపు విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో మరో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని అంచనా వేశారు. తద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225 కు చేరుకొనుంది. అయితే నియోజకవర్గాల పెంపును దృష్టిలో పెట్టుకొని ప్రధాన రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. ఈ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే నియోజకవర్గాల విభజనతో పాటు పెంపునకు సంబంధించి అధికార కూటమి మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. వారికి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన ఉండే అవకాశం ఉంటుంది. చివరిసారిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరిగింది. ఇప్పుడు కూడా టిడిపి కూటమికి లాభం చేకూరే అవకాశం ఉంది.

 బలమైన నేతలపై టిడిపి..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) బలమైన స్థితిలో ఉంది. 135 అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ఇంకా భవిష్యత్తు వ్యూహరచన లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను భారీగా ఆకర్షించగలిగింది. కేవలం నియోజకవర్గాల పునర్విభజన దృష్టిలో పెట్టుకొని వైసీపీలో ఉన్న బలమైన నేతలను టిడిపిలోకి రప్పించింది. అనివార్య కారణాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే ప్రత్యామ్నాయంగా కొంతమంది నేతలను సిద్ధం చేసుకుంది. నియోజకవర్గాల పెంపుతో లభించే స్థానాలకు ముందస్తుగానే నేతలను సంసిద్ధులను చేసింది తెలుగుదేశం పార్టీ. ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం.. రెండు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైసీపీ నేతలను ఆకర్షించడం.. ఇలా ద్విముఖ వ్యూహంలో తెలుగుదేశం పార్టీ ఉంది.

 రాయలసీమ పై ఫోకస్..
జనసేనకు( janasena ) సంబంధించి నియోజకవర్గాల పెంపు పై కూడా దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టింది జనసేన. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి శతశాతం విజయం సాధించింది. వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని సీట్లు పొందాలని చూస్తోంది. నియోజకవర్గాల పెంపులో భాగంగా.. పెరిగిన సీట్లలో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పార్టీని విస్తరించాలని చూస్తోంది. అందుకే బలమైన నేతలను ముందుగా పార్టీలోకి రప్పించింది. నియోజకవర్గాల పెంపు పై ఒక అంచనాకు వస్తే మరింత మంది నేతలను పార్టీలోకి రప్పించేందుకు వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా ఈసారి జనసేన రాయలసీమ జిల్లాలపై దృష్టి పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది.

 జగన్ ఆలోచన అదే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు తమ వైపు చూస్తారని అంచనా వేస్తున్నారు. ఒకేసారి 50 నియోజకవర్గాల పెంపుతో తమకు కలిసి వస్తుందని ధీమాతో ఉన్నారు. పొత్తులో భాగంగా చాలామంది నేతలకు సీట్లు దక్కవని.. అటువంటి వారంతా వైసిపి వైపు చూడడం ఖాయమని భావిస్తున్నారు. ఇలా నియోజకవర్గాల పెంపు పై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే అసలు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందా? నియోజకవర్గాల పెంపు ఉంటుందా? అన్నదానిపై స్పష్టత లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version