Jagan: షర్మిల ఒకవైపు.. 2029 ఎన్నికలు మరోవైపు.. ఇండియా కూటమి వైపు జగన్.. కారణాలు అవే!

భవిష్యత్ రాజకీయాలపై జగన్ దృష్టి పెట్టారు. ఒకవైపు పగ పట్టిన షర్మిల.. మరోవైపు 2029 ఎన్నికలు. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని జగన్ అడుగులు వేస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 25, 2024 9:22 am

Jagan

Follow us on

Jagan : ఏపీ రాజకీయాలు జాతీయస్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో భవిష్యత్ రాజకీయాలు అంచనా వేసుకొని జగన్ పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కూటమికి ప్రత్యామ్నాయం తానేనని చాటి చెప్పాలని సంకేతాలు పంపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సోదరి షర్మిలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అటు షర్మిల సైతం అధికార కూటమి ప్రభుత్వం కంటే జగన్ పైనే దాడిని కొనసాగిస్తున్నారు. దీంతో భవిష్యత్తుపై జగన్ కు భయం వెంటాడుతోంది. అందుకే ఇండియా కూటమి వైపు మొగ్గుచూపి.. కాంగ్రెస్ కు దగ్గర కావాలన్నది జగన్ ప్లాన్. తద్వారా జాతీయస్థాయిలో రాజకీయ మద్దతుతో పాటు ఏపీలో సోదరి షర్మిలను నిలువరించవచ్చన్నది జగన్ వ్యూహం. అందుకే సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ద్వారా ఇండియా కూటమికి దగ్గర కావాలని ఆలోచన చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ధర్నాకు దాదాపు ఇండియా కూటమి నేతలే వచ్చారు. సంఘీభావం తెలిపారు. తద్వారా తాను ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు సంకేతాలు పంపించారు జగన్. బిజెపి పెద్దల నుంచి ప్రమాదం ఉన్నా.. సోదరి షర్మిల నుంచి ఎదురయ్యే పరిణామాలను ఊహించే జగన్ ఢిల్లీ బాట పట్టినట్లు తెలుస్తోంది. తాను ఇప్పుడు రాజకీయంగా పలుచన అయితే.. అది కచ్చితంగా షర్మిలకు కలిసి వస్తుందని జగన్ కు తెలుసు. షర్మిల ద్వారా జగన్ ను నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు వెనకాడరు. ఆ చాన్స్ వారికి ఇవ్వకూడదని జగన్ భావించారు. అందుకే ఢిల్లీ వేదికగా పోరాటం చేశారు.

* ఇబ్బందులు ఉన్నా
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమికి మద్దతు తెలిపితే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ కు తెలుసు. అక్రమాస్తుల కేసులతో పాటు బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి వస్తుంది. పైగా చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామి. ఆయన పరపతి బాగా పనిచేస్తోంది. తనను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెడతారు. అలాగని ఇప్పుడు ఇండియా కూటమి వైపు వెళ్లకుంటే.. ఏపీలో తనకు కలిసి వచ్చే పార్టీలు లేవు. ఒంటరి పోరాటం అంత ఈజీ కాదు. పైగా తాను వెనక్కి తగ్గితే షర్మిల బలోపేతం కావడం జగన్కు ఇష్టం లేదు. అందుకే జగన్ వ్యూహం మార్చి ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న చర్చ నడుస్తోంది.

* బలాబలాలు బేరీజు వేసుకొని
ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి బలం తగ్గుతోంది. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. ఇండియా కూటమి సైతం బలపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగా ఇండియా కూటమిలో చేరితే తనపై కేసుల విషయంలో జాతీయ పార్టీ అండదండలు దొరుకుతాయని భావిస్తున్నారు జగన్. ఎన్డీఏ పెద్దల ఆగ్రహానికి గురైనా.. ఇండియా కూటమి నేతలు ఆదరిస్తారని అంచనా వేసి అడుగులు వేశారు జగన్.

* కాంగ్రెస్ భావజాలం
ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చినవే. కాంగ్రెస్ భావజాలానికి దగ్గరగా ఉంటాయి. వైసీపీ పరిస్థితి కూడా అదే. వైసీపీలో ఉన్న నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ నేతలే. అందుకే జగన్ తన పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు చేరకుండా.. ఇండియా కూటమిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తద్వారా నేతలు ఎక్కడ ఉంటే ఏంటని ఒక అభిప్రాయానికి వస్తారని… వైసీపీలో కొనసాగుతారన్నది జగన్ వ్యూహం. 2029 ఎన్నికల నాటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకుందామని.. అంతవరకు మాత్రం ఇండియా కూటమి వైపు ఉన్నట్లు సంకేతాలు ఇస్తామని ఆలోచనలో జగన్ ఉన్నారు. అన్నింటికీ మించి సోదరి షర్మిలను నియంత్రించేందుకు ఇండియా కూటమి వైపు వెళ్లారన్నది విశ్లేషకుల అభిప్రాయం.