MP Avinash Reddy – Abhishek Reddy : కడప జిల్లాలో జగన్ ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు చూస్తున్నారా? ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని భావిస్తున్నారా? అందుకే ముందుగా నాయకత్వాన్ని తయారుచేసుకునే పనిలో పడ్డారా? అందులో భాగంగా వైఎస్ అభిషేక్ రెడ్డి, దుశ్యంత్ రెడ్డి వంటి యువకులు తెరపైకి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి వెంట వైఎస్ అభిషేక్ రెడ్డి ఇటీవల తరచూ కనిపిస్తున్నారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి అరెస్టయితే మాత్రం అభిషేకర్ రెడ్డి క్యాండిడేట్ గా ఫిక్స్ చేసే చాన్స్ ఉంది.
కడప జిల్లా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాక ముందు కడప ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అటు తరువాత ఆయన సోదరుడు వివేకానందరెడ్డి రెండుసార్లు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. పదేళ్ల పాటు పదవిలో కొనసాగారు. తరువాత జగన్ ఎంపీగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రెండుసార్లు పోటీచేసి కేవలం ఐదేళ్లు మాత్రమే పదవిలో కొనసాగారు. అటు తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లో ఆయనే ఎంపీగా ఎన్నికయ్యారు. అంటే సరాసరి 45 ఏళ్ల పాటు కడప పార్లమెంట్ స్థానం వైఎస్ కుటుంబం చెప్పుచేతల్లో ఉందన్న మాట.
వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర రెడ్డి ఇద్దరూ వైసీపీలో కీలకంగా ఉన్నారు. గత పన్నెండేళ్ళుగా కడప జిల్లాలో పార్టీని వారే చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఇపుడు వైఎస్ వివేకా హత్య కేసులో వారి చుట్టూ కేసుని సీబీఐ తిప్పుతోంది. వైఎస్ భాస్కర రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయం అలా ఆగి ఉంది. వివేకా హత్య కేసుపై కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి న్యాయపరంగా పోరాడుతోంది. ఆమెను టీడీపీ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తోంది అని అంటున్నారు. సునీతా రెడ్డి కనుక ఓకే అంటే ఆమెను పులివెందుల అసెంబ్లీ నుంచి అయినా లేక కడప పార్లమెంట్ సీటుకు అయినా పోటీకి దింపాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్.
భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి లేని లోటను అదే కుటుంబంతో పూడ్చుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అయిన డాక్టర్ అభిషేక్ రెడ్డిని బరిలోకి దించనున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ రెడ్డి విశాఖలో పేరుమోసిన డాక్టర్. ఆయనకు పులివెందుల బాధ్యతలను అప్పగించారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో అభిషేక్ రెడ్డిని కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయించేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు అని అంటున్నారు.డాక్టర్ గా జనంలో మంచి పేరు ఉన్న అభిషేక్ రెడ్డి నవ యువకుడు. ఆయన పట్ల జనంలో మంచి అభిప్రాయం ఉంది. ఇక వైఎస్ దుష్యంత్ రెడ్డి అని కొత్త పేరు ఒకటి ఇపుడు బయటకు వస్తోంది. ఈయన వరసకు జగన్ కి సోదరుడు అవుతారు అని అంటున్నారు. ఈయనను కమలాపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దించి పోటీ చేయించే ఆలోచన ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే వైఎస్ కుటుంబంలో మరో తరం నాయకత్వం తెరపైకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైందన్న మాట.