AP Liquor Sale : రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. పాత ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. కొన్ని మద్యం బ్రాండ్లకు సంబంధించి ధరలు కూడా తగ్గించారు. మరి కొన్నింటిని తగ్గించేందుకు కూడా నిర్ణయించారు. అయితే ఇంత చేస్తున్న పొరుగు రాష్ట్రాల మద్యం రాష్ట్రంలో చలామణి అవుతుండడం విశేషం. వైసిపి ప్రభుత్వ హయాంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచాయి. అప్పటివరకు ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి సొంతంగా షాపులను ఏర్పాటు చేశారు జగన్. కానీ అక్కడ నాసిరకం మద్యం అమ్మకాలు జరిగేవి. ధరలు కూడా భారీగా పెంచేశారు. దీంతో అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, మరోవైపు తమిళనాడు, ఇంకోవైపు ఒడిస్సా మద్యం ఏపీకి చేరేది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడేది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో మాదిరిగా ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. పాత ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. అయినా సరే పొరుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ చలామణి అవుతుండడం విశేషం. గత ఏడాది 71,365 లీటర్ల మద్యం పట్టుబడగా.. ఈ ఏడాది 1.89 లక్షల లీటర్లు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది.
* భారీగా ధరలే కారణం
ఇతర రాష్ట్రాల మద్యం మన రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణం మద్యం ధరలే. ఏపీలో అధిక ధరలు ఉండడం, పక్క రాష్ట్రాల్లో తక్కువ ధర ఉండడంతోనే అక్కడి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో పొరుగు రాష్ట్రాల మద్యంతో పాటు సారా ఏరులై పారింది. అప్పట్లో మద్యం ధరలు తగ్గించడంతో వాటి నియంత్రణ సాధ్యమైంది. అయితే మంచి బ్రాండ్లు లేకపోవడంతో అప్పట్లో అదే పరంపర కొనసాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 3300 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ధరల్లో మాత్రం పెద్దగా వ్యత్యాసం లేదు. దానికి కారణంగానే తక్కువ ధర ఉన్న పొరుగు రాష్ట్రాల మద్యాన్ని తెప్పించుకుంటున్నారు. భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
* స్టాక్ అందుబాటులో ఉంచక
ఇటీవల ఏపీలో ఓ పది మద్యం బ్రాండ్ల ధరలు తగ్గాయి. మిగిలిన బ్రాండ్ల ధరలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం క్వార్టర్ రూ.99 ల ధర ప్రకటించినా.. స్టాక్ మాత్రం అందుబాటులో ఉండడం లేదు. మిగతా బ్రాండ్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుండడంతో షాపుల్లో పెద్దగా స్టాక్ ఉంచడం లేదు. డిమాండ్ భారీగా ఉండడంతో పరిమితంగానే సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు కేంద్ర పాలిత ప్రాంతాలైన గోవా, యానాంలలో సాధారణంగానే మద్యం ధరలు తక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ నుంచి ఎక్కువగా తెప్పించుకుంటున్నారు.
* నాణ్యత పై అనుమానాలు
ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో చాలా రకాల బ్రాండ్లను తీసుకొచ్చింది. అయితే కొన్ని బ్రాండ్లను 99 రూపాయలకే అందిస్తోంది. ఓ పది మద్యం బ్రాండ్ కంపెనీలు తమ ధరలను తగ్గించేందుకు సిద్ధపడ్డాయి. అయితే ఇలా తగ్గించిన మద్యం నాణ్యత విషయంలో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. పాపులర్ మద్యం బ్రాండ్లు సైతం నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయి అనే వాదన వినిపిస్తోంది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నా.. గతంలో ఉన్న నాణ్యత లేదన్న భావన మందుబాబుల్లో ఏర్పడింది. ఈ ప్రభావం మద్యంపై పడుతోంది. పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారేందుకు అవకాశం కలుగుతోంది.