Tirumala : వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం తిరుమల ముస్తాబౌతోంది. ఈనెల 10 నుంచి 19 వరకు శ్రీనివాసుడి ఉత్తర ద్వారా దర్శనం కలగనుంది. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో స్థానిక ఆలయాల్లోనూ విస్తృతంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్ళను వేస్తున్నారు. రంగవల్లులతో తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరిస్తున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఆ ఆలయాల్లో
అయితే ఒక్క తిరుమలలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో సైతం ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు. అన్నమయ్య రాయచోటి జిల్లా నందలూరులోని సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం ఐదు గంటలకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈనెల 11న గ్రామోత్సవం నిర్వహిస్తారు. 13న గోదాదేవి కళ్యాణం, 15న పర్వేట ఉత్సవాలు కొనసాగనున్నాయి. అందులో భాగంగా తెల్లవారుజాము మూడు గంటల నుంచి తిరుప్పావై ప్రవచనాలు ఉంటాయి.
* తిరుప్పావై సేవలు
చిత్తూరు జిల్లా సదుం మండలం బొర్రాగమంద శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సైతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు కల్పించనున్నారు. తిరుప్పావై తో స్వామి వారిని మేల్కొలుపుతారు. ధనుర్మాస కైంకర్యాలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయం, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు టిటిడి అధికారులు.