AP BJP President : ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ రానున్నారా? పురందేశ్వరి మార్పు ఖాయమా? హై కమాండ్ నుంచి సంకేతాలు అందాయా? సంక్రాంతి తర్వాత బిజెపిలో మార్పులు ప్రారంభమవుతాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపి సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని ప్రచారం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు కార్యవర్గాలను ఎన్నుకోవడం బిజెపిలో ఆనవాయితీగా వస్తోంది. 2023 జూలైలో ఏపీ బీజేపీ చీఫ్ గా ఎంపికయ్యారు పురందేశ్వరి. ఈ ఏడాది జూలై తో ఆమె పదవీకాలం ముగియనుంది. అయితే ఇప్పుడు ఆమెను తొలగిస్తారని.. ఆమె స్థానంలో మరొకరిని బిజెపి చీఫ్ గా నియమిస్తారని ప్రచారం నడుస్తోంది.
* బిజెపికి పెరిగిన ఓట్లు, సీట్లు
ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సొంతం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఏపీలో సైతం ఓట్లతో పాటు సీట్లను సాధించింది. ఎనిమిది అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. పురందేశ్వరి నేతృత్వంలో బిజెపి ఘన విజయం సాధించడంతో ఆమెకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అంతా ఆశించారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలవడంతో.. కేంద్ర మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ ఆమె మంత్రివర్గంలోకి తీసుకోలేదు. నరసాపురం నుంచి గెలిచిన భూపతి రాజు శ్రీనివాస వర్మకు కేంద్రమంత్రిగా ఛాన్స్ దక్కింది. అయితే సంక్రాంతి తరువాత కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. అప్పుడు పురందేశ్వరికి తప్పకుండా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే బిజెపి చీఫ్ గా మరొకరిని నియమించే అవకాశం ఉంది.
* ప్రధానంగా వారి పేర్లు
బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ అధ్యక్ష పదవికి సైతం కొత్త వారిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ప్రధానంగా సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత పురిగల్ల రఘురాం పేర్లు వినిపిస్తున్నాయి. మరి హై కమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.