NTR Jayanthi : చంద్రబాబు జబ్బులు చరుచుకుంటాడు, కెసిఆర్ చక్రాలు తిప్పుతున్నాననే భ్రమలో ఉంటాడు. కానీ వీళ్ళిద్దరి కంటే ముందు ఉత్తరాదిలో మీసం మెలేసినవాడు ఎన్టీఆర్. ఎగతాళి చేసిన నోళ్లను మూయించినవాడు ఎన్టీఆర్. అణచివేతకు వ్యతిరేకంగా నిలువెత్తు ధిక్కార స్వరాన్ని వినిపించిన వాడు ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ ను తెలుగువాడి ఆత్మగౌరవం అంటారు. వాస్తవానికి ఎన్టీఆర్.. ఆ పేరే ఓ ప్రభంజనం. వెండితెరపై ఆయనది విశ్వరూపం.
రాజకీయ యవనికపై నవోత్తేజం.. ఏకవ్యక్తి సాధించిన విప్లవం.‘మదరాసీ’ ముద్ర తీసి తెలుగు బావుటా ఎగరేసిన ఆత్మాభిమానం. ఢిల్లీ గుండెలు దద్దరిల్లేలా నినదించిన ఆత్మగౌరవం. ఆయన సృష్టించిన చరిత్ర. చిరస్మరణీయం. వెండితెరపై ఎన్టీఆర్ పోషించినన్ని పాత్రలు ఈనాటికీ ఎవరూ ధరించలేదు. అదొక రికార్డు. పౌరాణికం, సాంఘికం…రెండూ ఊపేశారు. రాజకీయాల్లోనూ ఆయనది అదే ట్రెండ్. ఆయన తెచ్చిన పథకాలన్నీ సంచలనమే. పార్టీపెట్టిన తొమ్మిదినెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఆయన, నూరేళ్లు గుర్తుపెట్టుకునేలా తీసుకున్న ప్రతి నిర్ణయమూ విప్లవాత్మకమే.
అదరడు బెదరడు
అదరడు… బెదరడు… ఎవరికీ తలవంచడు… అవినీతిని ఏమాత్రం సహించడు… తప్పు చేస్తే ఉపేక్షించడు…ఒత్తిడికి తలవంచడు…ఓ నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయాల్సిందే…రాజకీయాల్లో మొండిఘటం… ఇవన్నీ విశేషణాలో, అతిశయోక్తులో కాదు. తెలుగు నేల చూసిన, ప్రతి తెలుగువాడికీ తెలిసిన చరిత్ర ఇది. రాజకీయాల గతిని ఉమ్మడి ఏపీలో మలుపు తిప్పిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్.తొలి అడుగుతోనే రాజకీయాలను ఆయన షేక్ చేశారు. సంచలన పరిణామాలెన్నింటికో ఆద్యుడయ్యాడు. ‘మదరాసీలు’ అని దక్షిణాదిని ఎగతాళి చేసే ఉత్తరాదిలోనే రాజకీయచక్రం తిప్పిన మొనగాడు. నేషనల్ ఫ్రంట్ సారథిగా తెలుగువాడి సత్తా చాటిన యోధుడు. అంతర్గత కుట్రలు, బయటి శక్తుల కుతంత్రాలు ఆయనను గద్దె నుంచి తోసేస్తే… యావత్తు ఆంధ్ర దేశం ఊగిపోయింది. ప్రజాస్వామ్యపునరుద్ధరణ జరిగేదాకా రోడ్లపైనే ఉంది. దటీజ్ ‘అన్నగారు’. పేదలకు అన్నవస్త్రాలు, రైతుల పొలాలకు భూమిశిస్తు రద్దు.. ఆడపడుచులకు తండ్రి ఆస్తిలో వాటా.. ఇలా స్వాతంత్య్ర భారతంలో ఉన్నామనే భావనను ఉమ్మడి ఏపీలో కలిగించిన సంక్షేమ భావనలు చాలావరకు ఎన్టీఆర్ హయంలో రూపుదిద్దుకున్నవే! సినీ యవనికపై ఆయనది నిత్య నవశకం. పాలిటిక్స్‌లో ట్రిక్స్‌ను చెరిపేసిన.. చెదరని శాశ్వత సంతకం. తెలుగునాట అన్న అంటే.. ఎన్టీఆర్ అన్నట్టుగా ఆ పదం ఆయనతో ముడిపడిపోయింది.
ఆ దాఖలాలు లేవు
ఎన్టీఆర్‌కు ముందు రాజకీయ నేతలను అన్న అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకున్న దాఖలాలు లేవు. వారిని అయ్యా అనో, దొరవారనో, దొరా అనో సంబోధించేవారు. ఎన్టీఆర్ తనకు తాను బహిరంగ సభల్లో ప్రజలకు అన్నగా పరిచయం చేసుకున్నారు. ‘నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు’ అంటూ ఆయన ప్రసంగం ప్రారంభించేవారు. ప్రజలు, నేతలు కూడా ఆయనను అన్నా అని పిలవడానికి అలవాటు పడిపోయారు. గౌరవంగా పిలవాల్సి వస్తే అన్నగారు అని అనేవారు. చివరకు ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు కూడా వేదికలపై ఆయనను అన్నగారు అనే మాట్లాడేవారు. తర్వాతి కాలంలో ఎంతమంది అన్నలు వచ్చినా ఒక తరం తెలుగువారిలో అన్న అంటే ఎన్టీఆర్ అనే ముద్ర పడిపోయింది.
మహిళలకు మేలు చేసేదైతే…
సాధారణంగా అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులు మాత్రమే అసెంబ్లీ, పార్లమెంటుల్లో పాసవుతుంటాయి. ప్రతిపక్షాలు చెప్పే అంశాలు కానీ, బిల్లుల ఆమోదానికి కానీ తావుండదు. కానీ, ఎన్టీఆర్ సర్కారు మాత్రం అందుకు మినహాయింపు. ప్రైవేటు సభ్యులు పెట్టే బిల్లులు పాస్ కావని తెలిసినా 1985లో అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడిగా ఉన్న (మహారాష్ట్ర మాజీ గవర్నర్) సి.హెచ్ విద్యాసాగర్‌రావు బహు భార్యత్వానికి సంబంధించి భారత శిక్ష్మా స్మృతిలోని ఐపీసీ సెక్షన్లు 494, 495, 496లను నాన్‌బెయిల్‌బుల్, కాగ్నిజబుల్ నేరాలుగా సవరించాలనే బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సవరణతో బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందన్నది ఆయన ఉద్దేశం. ఇదే అంశాన్ని ప్రతిపక్ష పార్టీ విప్‌నకు కూడా వివరించారు. ఆ వెంటనే ఈ బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్‌కు అప్పటి టీడీపీ విప్ ఫోన్ చేశారు. ‘‘బిల్లు చర్చకు వచ్చింది… మేం వ్యతిరేకించాలి కదా’’ అని అడిగారు. మళ్లీ చర్చ చివరి దశకు రాగానే మరోసారి ఫోన్ చేశారు. స్పందించిన ఎన్టీఆర్ ఈ బిల్లు ఎవరి కోసం అని అడగ్గా మహిళలకు మేలు చేసేదని విప్ చెప్పడంతో వెంటనే సదరు బిల్లును సమర్థించాలని శాసనసభ్యులకు ఆదేశాలిచ్చారు. దీంతో సదరు ప్రైవేటు బిల్లు పాసయింది. ఆ తర్వాత వారంలోనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో చట్టంగా మారి రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. దీంతో దేశంలోనే ప్రైవేటు సభ్యులు ప్రవేశ పెట్టినా పాసయిన బిల్లుగా నిలిచిపోయింది.