AP Elections 2024: గత ఎన్నికల్లో వైసిపి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లోనే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. రాయలసీమలో మూడు స్థానాలు తప్పించి.. స్వీప్ చేసింది. బోనస్ గా నిలుపుకుంది. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అనుసరిస్తోంది. ఆ ఏడు జిల్లాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టు వ్యూహరచన చేస్తోంది.
ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసిపి 28 సీట్లను గెలిచింది. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాలకు గాను 28 స్థానాల్లో విజయం సాధించింది. కృష్ణ,గుంటూరు జిల్లాల పరిధిలో 33 నియోజకవర్గాలకు గాను.. 29 చోట్ల వైసీపీ గెలిచింది. ఈ మూడు ప్రాంతాల్లోనే.. 101 స్థానాలకు గాను 85 సీట్లను వైసిపి కైవసం చేసుకుంది. అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న దృష్ట్యా.. 40 నుంచి 50 సీట్లు ఈ ఏడు జిల్లాల్లో సాధిస్తామని… రాయలసీమలో ఎలాగూ మెరుగైన ఫలితాలు సాధిస్తాం కనుక… అధికారంలోకి వస్తామన్న ధీమా వైసీపీలో కనిపిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఏమంత బాగాలేదు. అక్కడ ఎన్డీఏ కూటమి బలం పెంచుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టిడిపి కూటమి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఉత్తరాంధ్రలో 34 సీట్లలో 30 చోట్ల, ఉభయగోదావరి జిల్లాలో 34 సీట్లలో 30చోట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 33 సీట్లలో 28 చోట్ల గెలవడం ద్వారా.. మ్యాజిక్ ఫిగర్ దాటుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతోంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలిసి వస్తుందని అంచనా వేస్తోంది.
ఉత్తరాంధ్రలో సీన్ రివర్స్ అవుతోంది. 2019 ఎన్నికల్లో టిడిపి పరాజయం చవిచూసింది. ఉమ్మడి శ్రీకాకుళంలో పది అసెంబ్లీ సీట్లకు గాను రెండు చోట్ల, ఉమ్మడి విశాఖలో నాలుగు సీట్లను మాత్రమే టిడిపి గెలుచుకుంది. విజయనగరంలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో మాత్రం శ్రీకాకుళంలో 8 సీట్లు, విజయనగరంలో ఏడు సీట్లు, విశాఖపట్నంలో అన్ని సీట్లను టిడిపి గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం కూటమి భారీ విజయం దక్కించుకునే పరిస్థితి ఉంది. ఇక అమరావతి రాజధాని ప్రభావంతో కృష్ణ,గుంటూరు జిల్లాల్లో సైతం కూటమి పార్టీలకే ప్రజలు జై కొడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అధికార, విపక్షాలు ఆ ఏడు జిల్లాలపై ఫోకస్ పెట్టడం విశేషం.