AP Pension: ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. వారికి అనుకూలంగా కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ ని మరింత సరళతరం చేసింది. రెండు నెలల పాటు వరుసగా పింఛన్ తీసుకోకపోయినా టెన్షన్ ఉండదు. తరువాత నెలలో మూడు నెలలకు సంబంధించి పింఛన్ మొత్తాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే.. ఆ మరుసటి నెల నుంచి భార్యకు వితంతు పింఛన్ అందించనున్నారు. సాధారణంగా చాలామంది వివిధ కారణాలతో పింఛన్ సకాలంలో తీసుకోరు. అటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అందుకే వారికి అనుకూలంగా కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడు నెలల పెన్షన్ లబ్ధిదారులు ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది.
* మరింత సరళతరం
పింఛన్ లబ్ధిదారుడు చనిపోతే.. ఆయన భార్యకు వితంతు పింఛన్ అందించేందుకు చాలా సమయం పడుతుంది. కొత్తగా దరఖాస్తు పెట్టుకుని.. మంజూరు ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతుంది. తాజాగా ఈ నిబంధనను కూడా ప్రభుత్వం మార్చింది. పెన్షన్ తీసుకుంటున్న యజమాని మరణిస్తే.. మరుసటి నెల నుంచి మృతుడి భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎక్కువమంది ఆహ్వానిస్తున్నారు.
* కూటమి సానుకూల నిర్ణయాలు
పింఛన్ల విషయంలో ఆది నుంచి కూటమి ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తం అవుతోంది. తాము అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. బకాయిలు సైతం చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అప్పటివరకు మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలు చేశారు చంద్రబాబు. ఏప్రిల్ నుంచి వర్తింపజేసి జూలైలో మూడు నెలల మొత్తాన్ని అందించారు. దీంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మరోవైపు ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ అందించగలుగుతున్నారు. మూడో తేదీ లోపు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు పింఛన్ల పంపిణీలో సరళ తరం తీసుకొచ్చారు. మొత్తానికైతే పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.