Chandrababu : కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్టే.. చంద్రబాబు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి. రాజకీయ, పాలనా వైఫల్యాలు విపరీతమైన ప్రభావం చూపాయి. ఒక్క పాలించడమే కాదు.. ప్రజలను పట్టించుకోవడం మరిచిపోయిన చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అవసరాన్ని గుర్తెరిగి ప్రజలు ఎన్నుకున్నారు. కానీ వారి అంచనాలను అందుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ముఖ్యంగా ప్రజలకు వాస్తవాలు చెప్పి ఉంటే కొంత అర్ధం చేసుకునేవారు. కానీ బాబు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రజలను చేజేతులా దూరం చేసుకున్నారు.
వాస్తవానికి చంద్రబాబులో ఉన్న ప్రత్యకత విజనరీ. ఈ విషయంలో ఎంతోమందికి అభ్యంతరాలున్నా.. మెజార్టీ ప్రజలు మాత్రం మార్కులేస్తారు. బాబు అలానే ఉంటేనే ఇష్టపడతారు. కానీ తాను తీర్చలేని హామీలను సైతం ఇచ్చి అమలుచేయలేక బాబు ప్రజల వద్ద చులకన అయ్యారు. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ అంటూ ప్రకటించారు. కానీ పూర్తిస్థాయిలో అమలుచేయలేకపోయారు. పోనీ అందుకు తగ్గ కారణాలేమైనా చెప్పారా అంటే అదీ లేదు. రైతు రుణమాఫీ విషయంలో బడా రైతులు లబ్ధిపొందారు. చిన్నసన్నకారు రైతులకు వర్తించినా.. పెద్ద రైతులతో భేరీజు వేసుకొని తమకు అన్యాయం జరిగిందన్న ఆవేదన వారు మనసులో ఉంచుకున్నారు. ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రభావం చూపారు.
డ్వాక్రా రుణమాఫీ అయినా కరెక్టుగా అమలుచేశారా? అంటే అదీ లేదు. విడతవారీగా నగదు జమ చేశారు. ఎన్నికల చివరాఖరులో పసుపు కుంకుమ పేరిట హడావుడి చేశారు. కానీ మీకు హామీ ఇచ్చాను. ఇదిగో అమలుచేశాను అని మాత్రం చెప్పలేకపోయారు. అది ప్రతికూలతను చూపించింది. అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళల దెబ్బే అధికంగా చంద్రబాబు చవిచూశారు. అదే బాబు ఎన్నికలకు ఏడాది ముందే బాధ్యతగా ఒక ప్రకటన చేసి ఉంటే ప్రజలు కూడా అర్ధం చేసుకొని ఉండేవారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీ అమలుచేయలేకపోతున్నానని.. ఇదిగో ఇంతే పరిమితిలో చేయబోతున్నానని ప్రకటిస్తే ప్రజలు సహృదయంతో ఆహ్వానించి ఉండేవారు. కానీ బాబు అలా చేయలేదు.
చంద్రబాబు ఎటువంటి హామీలు ఇవ్వకపోయినా 2014లో ప్రజలు చంద్రబాబునే ఆదరించేవారు. అవశేష ఏపీకి పాలనాదక్షుడు అవసరమని ఫిక్స్ అయ్యారు. అందుకే జగన్ కు కాదని చంద్రబాబుకు అవకాశమిచ్చారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో అటు టీఆర్ఎస్ తో పాటు ఇటు వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న బాబును ప్రజలు నమ్మలేదు. చివరకు పథకాల కోసం ముందే కార్డులు పంచినా వర్కవుట్ కాలేదు. నగదు బదిలీ పథకాన్ని ప్రకటించినా జనాల్లోకి వెళ్లలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుది సంక్షేమంలో పేలవ ప్రదర్శన. అందుకే అటువంటి వాటి కంటే.,. జనాలకు వాస్తవాలు చెప్పి దగ్గర అయితే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు.